కాంగ్రెస్ అధిష్ఠానానికి పార్టీ సీనియర్లు రాసిన లేఖ అంశం నివురు గప్పిన నిప్పులా మారుతోంది. ఓ వైపు పార్టీ ఉన్నతశ్రేణి నాయకత్వం దీని నిర్ద్వందంగా తప్పుపడుతుండగా..సీనియర్లు మాత్రం సమర్థించుకుంటున్నారు. లేఖకు కారకులైన వారిపై చర్యలకు ఉపక్రమించడాన్ని కపిల్ సిబల్ వ్యతిరేకించగా.. తాజాగా మరో సీనియర్ నేత గులామ్‌నబీ ఆజాద్ కూడా పార్టీ చర్యలను తప్పుబట్టారు. నిజమైన కాంగ్రెస్ వాదులు లేఖను స్వాగతిస్తారంటూ చురకలంటించారు. పార్టీని ప్రక్షాళన చేయని పక్షంలో మళ్లీ ఎన్నికలొస్తే తమ లేఖను వ్యతిరేకించిన ఆఫీస్ బేరర్లు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కనిపిస్తారా?అని ప్రశ్నించారు.
"ఏ స్థాయి నాయకుడినైనా పార్టీ అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించి ఎన్నుకోవాలి. కనీసం ఒక్కశాతం మద్దతు లేని నాయకులు కూడా పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. వారికి ప్రజల మద్దతు లేకపోతే అక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా? పార్టీ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎవరి మద్దతు లేకపోయినా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఎన్నికైన వారిని తొలగించడం కుదరదు."
- గులామ్‌నబీ ఆజాద్
పార్టీని పూర్తిగా పక్షాళన చేయాలంటూ 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్ఠానానికి లేఖ రాయగా.. దీనిపై పెద్ద దుమారమే రేగింది. నాలుగు రోజుల క్రితం అత్యవసరంగా ఏర్పాటైన సీడబ్ల్యూసీ సమావేశంలో తాను అధ్యక్షపదవి నుంచి తప్పుకుంటానని సోనియాగాంధీ ప్రతిపాదించారు. కానీ, పార్టీ కోరిక మేరకు అధ్యక్షురాలిగా కొనసాగేందుకు అంగీకరించారు. మరోవైపు భాజపా నేతలతో కుమ్మక్కై సీనియర్లు లేఖ రాశారని రాహుల్ గాంధీ మండిపడినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీ అధిష్ఠానానికి, సీనియర్ నాయకులకు మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్ పతనానికి అవే కారణాలు'