కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని కడుసిద్ధేశ్వర గ్రామంలో 'కడు కురుబా సంఘం' తెగ పాటించే ఆచారం చాలా వింతగా ఉంటుంది. ఆ తెగకు సంబంధించిన వారు ఎవరైనా చనిపోతే ఒకే సమాధిలో ఖననం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది పూర్వీకుల నుంచి వస్తోన్న ఆచారం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ సమాధి ఉండేది కూడా గుడిలోనే. లోపల శంకరుని అవతారమైన సిద్ధేశ్వరుడు కొలువై ఉంటారు.
ఊరిలో చనిపోతేనే...
సిద్ధేశ్వరంలో సాధారణంగా ఎవరైనా మరణిస్తే ఆచారం ప్రకారం ఆ సమాధిలో ఖననం చేస్తారు. కానీ పెళ్లి అయి వేరే ఊరికి వెళ్లిన వారికి ఈ ఆచారం వర్తించదు. అంతేగాక ప్రమాదంలో చనిపోయిన వారిని కూడా ఆ సమాధిలో పూడ్చరు. 'ఆత్మహత్య మహా పాపం' అని నమ్మే గ్రామస్థులు ఇలా కాలం చేసిన వారిని కూడా ఖననం చేయడానికి అనుమంతిచరు. కేవలం ఊరిలో ఉండే వాళ్లకి మాత్రమే ఈ సంప్రదాయాన్ని అమలు చేస్తారు.
ఒకే సమాధిలో ఖననం చేయడం అనేది మా ఆచారం. మా తాతలు, తండ్రులు అలానే చేస్తూ వచ్చారు. మేము దానినే ఆచరిస్తున్నాం. బయటవారికి అది వింతగా ఉంటుంది.
-నారప్ప, గ్రామస్థుడు
కడుసిద్ధేశ్వర గ్రామంలో ఎంతోమంది మరణించారు. వారందరిని ఈ సమాధిలోనే పూడ్చిపెట్టాం. అత్తగారింట్లో చనిపోయిన వారికి ఈ ఆచారం వర్తించదు. ఊరిలో చనిపోయిన వారికి మాత్రమే ఇలా చేస్తాం. ప్రమాదంలో మరణించినా.. ఆత్మహత్య చేసుకున్న వారిని కూడా సమాధిలో పూడ్చనీయం. ఇలా చేయడం అనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.
-శేషప్ప, గ్రామస్థుడు
ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక గల కారణాలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇక్కడ దొరకడం లేదు. ఇది నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే అని గ్రామస్థులు చెబుతున్నారు.