బిడ్డ కడుపు నింపేందుకు ఆకాశంలోని చందమామనే ఇంటికి రప్పిస్తుంది అమ్మ. మరి కన్నకూతురు నొప్పితో బాధపడుతుంటే ఊరుకుంటుందా..? అందుకే అద్భుతమైన వ్యూహం అమలుచేసింది. బొమ్మకు కట్టుకట్టించి, కుమార్తెకు వైద్యం చేయించింది ఆ తల్లి.
తొడ భాగపు ఎముక విరిగి దిల్లీ లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరిన 11 నెలల చిన్నారి జిక్రా.. వైద్యం చేయించుకునేందుకు మొరాయించింది. గంటలు గడుస్తున్నా చికిత్సకు నిరాకరించింది. నొప్పి తట్టుకోలేకపోతున్నా వైద్యానికి ఒప్పుకోలేదు. డాక్టర్ను చూస్తేనే ఏడుపు మొదలెట్టింది. కానీ, బిడ్డ నొప్పితో బాధపడుతుంటే చూడలేని జిక్రా తల్లి ఫర్హీన్ మాలిక్... చక్కటి ఆలోచన చేసింది.
జిక్రాకు ఎంతో ప్రియమైన బొమ్మ పరీని ఆస్పత్రికి తీసుకొచ్చింది ఫర్హీన్. "నీ పరీకి కట్టు కడుతారు.. నువ్వూ కట్టించుకోవూ!" అని కోరింది. పరీని చూడగానే చిన్నారికి ప్రాణం లేచొచ్చింది. అదీ ఓ ఆట అనుకుని చికిత్సకు అంగీకరించింది.
"జిక్రా పుట్టినప్పటి నుంచి పరీ తనతోనే ఉంది. పరీని తన స్నేహితురాలిగా భావించి తనతో ఆడుకుంటుంది. నొప్పి కారణంగా తను చికిత్సకు నిరాకరించింది. అందుకే తన బొమ్మకు కట్టుకట్టమని వైద్యులను వేడుకున్నాను. ఇప్పుడు జిక్రా చికిత్సకు చక్కగా సహకరిస్తోంది."
-ఫర్హీన్ మాలిక్, జిక్రా తల్లి
జిక్రా పక్కనే చికిత్స పొందుతున్న పరీ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతోంది.
"బొమ్మకు చికిత్స చేసినట్టు నటించాలన్న గొప్ప ఆలోచన జిక్రా తల్లిదే. మేము అలాగే చేశాం. బొమ్మకు కట్టు జిక్రాకు కట్టినట్టే కట్టాం. అప్పుడు జిక్రా మెల్లగా మాకు సహకరించడం ప్రారంభించింది. ఇప్పుడు తను కోలుకుంటోంది. ఆమె తల్లి ఆలోచన ఫలించింది. ఈ సంఘటన మా ఆసుపత్రి వాతావరణాన్నే మార్చేసింది. "
-డా. అజయ్ గుప్తా, వైద్యుడు
ఇదీ చూడండి:నవ జంటను విడగొట్టిన పోటీ పరీక్షలు..!