దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ అత్యంత విషాదఘట్టం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1919, ఏప్రిల్ 13న పంజాబ్ అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ లో జరిగిన ఈ మారణహోమానికి నేటికి వందేళ్లు నిండాయి.
జలియన్ వాలాబాగ్లో సమావేశమైన ఉద్యమకారులపై జనరల్ రెజినాల్డ్ డయ్యర్ నేతృత్వంలో బ్రిటిష్ దళాలు కాల్పులకు పాల్పడ్డాయి. తూటాల గాయాలతో పాటు, తొక్కిసలాటలో అనేక మంది భారతీయులు మృతి చెందారు. ఇరుకైన ద్వారంగుండా వెళ్లలేని పరిస్థితులతో భారీగా మృతుల సంఖ్య పెరిగింది.
ఈ ఉదంతాన్ని భారతీయులు ఎప్పటికీ మరచిపోలేరు. డయ్యర్ దుస్సాహసానికి ఎందరో బలయ్యారని ఇప్పటికీ భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటూ ఏటా జలియన్ వాలాబాగ్ వద్ద సమావేశమవుతారు.
"1919లో ఏప్రిల్ 13న ఇక్కడ మారణకాండ జరిగింది. జనరల్ డయ్యర్ నిరాయుధులపై కాల్పులు జరిపాడు. ఈ ఉదంతంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో అమరులైన వారి బాధ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. వారికి నివాళులర్పించడానికి ఈ రోజున ఇక్కడ అందరం సమావేశమవుతున్నాం." - శ్రేష్ఠా సేట్, స్థానికురాలు
క్షమాపణలకు డిమాండ్
జలియన్ వాలాబాగ్ మారణహోమంపై బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆనాటి ఘటనలో మరణించిన వారి వారసులు డిమాండ్ చేస్తున్నారు. ఆనాటి భయానక ఘటనను తలుచుకుంటూ అనేక మంది ఇప్పటికీ కంటతడి పెడుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కచ్చితంగా క్షమాపణలు చెప్పితీరాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా తమను ప్రభుత్వం నిర్లక్షం చేసిందని, ప్రాణాలు అర్పించిన వారి వారసులుగా తమకు తగిన గుర్తింపు దక్కలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేళ్ల క్రితం పంజాబ్ ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల కార్డును ఇచ్చినప్పటికీ వాటికి విలువలేకుండా పోయిందన్నారు.
వందేళ్లు పూర్తయినందుకే అందరికి గుర్తొచ్చామని... క్యాండిల్ లైట్ మార్చ్ అంటూ తమ వద్దకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
థెరిసా మే విచారం
జలియన్ వాలాబాగ్ ఉదంతంపై బుధవారం బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఆ దేశ పార్లమెంటు సాక్షిగా విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఈ ఘటన తీవ్ర అమానుష చర్యగా, మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. అయితే దీనిపై మే క్షమాపణ మాత్రం చెప్పలేదు.