కరోనా వేళ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికల ప్రచారంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. చాలా వరకు పార్టీలు ఆన్లైన్ ప్రచారాల వైపు దృష్టిసారిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ట్విట్టర్లో విమర్శల వరకు సరే కానీ... బహిరంగ సభల్లో ప్రసంగాలు దంచికొట్టే నేతలకు ప్రత్యామ్యాయం ఏది?
ఈ ప్రశ్నకు జవాబు ఇస్తూ కేరళలో ఓ స్టార్టప్ పుట్టుకొచ్చింది. వర్చువల్ ప్రచారానికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తోంది. అచ్చంగా ఎన్నికల ర్యాలీలోనే పాల్గొన్నట్లు ఉండే వీడియోలను రూపొందిస్తోంది. ఇందుకోసం ఓ స్టూడియో నెలకొల్పింది. త్రిస్సూర్‌లోని దక్ష వర్చువల్ స్టూడియో ఈ సేవలు అందిస్తోంది.
అభ్యర్థులు పోడియం వద్ద నిల్చొని ప్రసంగిస్తే చాలు.. చుట్టూ ఉన్న తెరల(గ్రీన్ మ్యాట్)పై పార్టీ జెండాలు, గుర్తులతో పాటు సభకు జనం సైతం హాజరైనట్లు తీర్చిదిద్దుతారు. చూసినవారికి నిజమైన బహిరంగ సభ వీడియోలా కనిపిస్తుంది. అభ్యర్థి చేసిన వాగ్దానాలు, ఇతర వివరాలు, గణాంకాలను వీడియోకు జత చేస్తారు. పూర్తిగా సిద్ధం చేసిన వీడియోను ప్రచారం కోసం అభ్యర్థులకు అప్పగిస్తారు.
దీని వల్ల అభ్యర్థులకు ఖర్చు కూడా ఆదా అవుతుంది. బహిరంగ సభ నిర్వహణకు అయ్యే లక్షల ఖర్చును తగ్గించుకోవచ్చు. వర్చువల్ వీడియోలతో అతి తక్కువ వ్యయంతోనే ప్రచారం చేసుకోవచ్చు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థులు ఈ వీడియోల పట్ల ఆకర్షితులవుతున్నారు. కెమెరా ముందు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ప్రత్యేక ఫొటోషూట్లూ చేయించుకుంటున్నారు. ప్రచార చిత్రాలు, ఫ్లెక్సీల కోసం ఫోజులిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ప్రజల్లోకి వెళుతున్నారు.