దిల్లీ అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ చేసిన విమర్శలను తిప్పికొట్టింది భారతీయ జనతా పార్టీ. తమకు ఎవరూ రాజధర్మాన్ని నేర్పాల్సిన పని లేదని.. ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే రాజధానిలో అల్లర్లు చెలరేగాయని ఎదురుదాడి చేసింది.
దిల్లీ అల్లర్లపై గురువారం రాష్ట్రపతిని కలిసింది సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం. బాధ్యతలను విస్మరించినందుకు కేంద్ర హోంమంత్రి హోదా నుంచి అమిత్ షాను తొలగించాలని.. ప్రజలను రక్షించేలా కేంద్ర ప్రభుత్వానికి తన రాజధర్మాన్ని గుర్తుచేయాలని రాష్ట్రపతిని కోరింది. ఈ విషయమై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం స్పందించారు.
"సోనియా గాంధీజీ.. మాకు రాజధర్మం గురించి పాఠాలు చెప్పకండి. మీ పార్టీ చరిత్ర ఏంటో మాకు తెలుసు. కాంగ్రెస్ ఏదీ చేసినా మంచే.. మేం చేస్తే మాత్రం తప్పు. వాళ్లు ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇదేం రాజధర్మం? ఓటుబ్యాంకు రాజకీయాలకోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుంది. కాంగ్రెస్‌కు దేశానికన్నా పార్టీ, కుటుంబమే ముఖ్యం."
- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మంత్రి
భాజపా నేతలు కపిల్ మిశ్రా, ప్రవేశ్ వర్మ చేసిన వ్యాఖ్యలను పార్టీ ఆమోదించదని ప్రసాద్ స్పష్టం చేశారు.
మాది సమానత్వం..
రవిశంకర్ విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ నాయకులు సమానత్వం, సామరస్య పాలనకే ప్రాముఖ్యాన్ని ఇచ్చారని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
"ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మోహన్ తమ రాజధర్మంలో సమానత్వం, సామరస్యానికే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ మీరేం చేస్తున్నారు? మీలో పక్షపాతం ఉంది. విభజన మనస్తత్వం ఉంది."
-కాంగ్రెస్
అల్లర్లపై కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు..
మరోవైపు.. దిల్లీలో అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు సోనియా. వీలైనంత తొందరగా పరిశీలించి నివేదిక అందించాలని వారిని ఆదేశించారు.
ఈ కమిటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, దిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శక్తిసింగ్ గోహిల్, హరియాణా పీసీసీ చీఫ్ కుమారి సెల్జా, మాజీ ఎంపీ తారీక్ అన్వర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ ఉన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతలు- షా రాజీనామాకు డిమాండ్