దేశంలో చాలా చోట్ల లాక్డౌన్ ఉల్లంఘనలను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. కంటెయిన్మెంట్ జోన్లలో మార్గదర్శకాలు ఖాతరు చేయట్లేదని.. ఆ విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రాత్రి పూట కర్ఫ్యూను కచ్చితంగా పాటించాలని.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.
"మీడియా నివేదికలతో చాలా ఉల్లంఘనలు హోంశాఖ దృష్టికి వచ్చాయి. మేం మరోసారి స్పష్టంగా చెబుతున్నాం. కేంద్ర హోంశాఖ జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అమలు చేయాలి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి."
- అజయ్ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి
ఇప్పటికే లాక్డౌన్ 4.0 నేపథ్యంలో మార్గదర్శకాలను నీరుగార్చవద్దని మే 18న కేంద్ర హోంశాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. అయినప్పటికీ నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకోవటంపై మరోసారి స్పందించింది హోంశాఖ.