ఇటీవలే కశ్మీర్ అంశంపై భారత్, పాకిస్థాన్ ప్రధాన మంత్రులతో ఫోన్లో సంభాషించిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. ఈ వారాంతంలో ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశం వేదికగా కశ్మీర్ సమస్యపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చిస్తానని ప్రకటించారు. అవసరమైతే మధ్యవర్తిత్వం కూడా చేస్తానని స్పష్టం చేశారు.
" నేను ప్రధాని నరేంద్రమోదీని కలుస్తాను. ఈ వారాంతంలో జరగబోయే సమావేశంలో ఆయనతో భేటీ అయ్యి... భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ముగిసేందుకు మధ్యవర్తిత్వం సహా నాకు సాధ్యమైంది చేస్తాను.
ఇద్దరు ప్రధానులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఇరు దేశాల మధ్య మైత్రి ఇప్పుడు లేదు. ఇది విపత్కర పరిస్థితి. సోమవారం ఇద్దరు ప్రధానులతో మాట్లాడాను. వారు సమున్నత వ్యక్తులు. జాతీయ భావం మనస్సున నింపుకున్నవారు."
-ట్రంప్ ప్రకటన
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు అనంతరం నెలకొన్న ఉద్రిక్తతలను నియంత్రించే నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ, పాక్ సుప్రిమో ఇమ్రాన్‌ఖాన్‌తో చరవాణిలో సంభాషించారు ట్రంప్. అనంతరమే ఈ ప్రకటన వెలువడింది.
ఇరు దేశాల మధ్య సమస్య జఠిలంగా మారిందని... పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం సహా ప్రత్యామ్నాయాలు చేపట్టేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే ఆ వ్యాఖ్యలపై వెనక్కు తగ్గినప్పటికీ మరోసారి మధ్యవర్తిత్వంపై తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని అంతర్జాతీయ సమాజానికి చెప్తూ వస్తోంది భారత్. పాక్ వాస్తవ పరిస్థితులను అంగీకరించక తప్పదని పలుమార్లు చెప్పింది.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: ఇస్రో సారథితో ఈటీవీ భారత్ ముఖాముఖి