అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా ఐటీసీ మౌర్య రెస్టారెంట్ 'బుఖారా' తనదైన వంటకాలతో విందు ఏర్పాట్లు చేస్తోంది. అధ్యక్షుడికి నచ్చేలా పసందైన రుచులతో 'ట్రంప్ తాలీ'ని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
అదే బుఖారా ప్రత్యేకత!
బుఖారా రెస్టారెంట్ అమెరికా మాజీ అధ్యక్షులు సహా ఎన్నో దేశాల అధినేతలకు ఆతిథ్యమిచ్చింది. అయితే ఈ ప్రఖ్యాత రెస్టారెంట్ గత 41 ఏళ్లుగా తన మెనూను మార్చకపోవడం విశేషం.
అమెరికా అధ్యక్షుడి కోసం చేసిన ఏర్పాట్లు గురించిగానీ, వడ్డించే ఆహారం (మెనూ) గురించి గానీ ఈ రెస్టారెంట్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఒబామా ప్లేటర్
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడి హోదాలో 2010, 2015లో రెండు సార్లు భారతదేశాన్ని సందర్శించారు. అప్పుడు కూడా బుఖారా రెస్టారెంట్ ఆయనకు 'ఒబామా తాలీ' అందించింది. ఇందులో తందూరీ జింగా, మచిలి టిక్కా, ముర్గ్ బోటి బుఖారా, కబాబ్‌లు ప్రత్యేకంగా వడ్డించారు. అప్పటి నుంచి ఈ వంటకాలు... ముఖ్య అతిథుల ప్రధాన మెనూలో ఒక భాగంగా మారిపోయాయి.
అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఎంపిక చేసిన కొంతమంది వ్యక్తులకు ఈ రెస్టారెంట్లోనే ప్రైవేటు విందు కూడా ఇచ్చారు.
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా బుఖారాను సందర్శించనపుడు.. ఈ హోటల్ క్లింటన్ తాలీ, చెల్సియా తాలీలను అందించింది.
మైమరిపించే రుచులు
బుఖారా వంటకాల్లో ప్రధానంగా తందూరీ, కబాబ్స్, దాల్ బుఖారా, ఖాస్తా రోటీ, భార్వాన్ కుల్చా ఉంటాయి.
ప్రత్యేక బహుమతి
బుఖారా రెస్టారెంట్ ట్రంప్‌కు ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌తో ఆప్రాన్ బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది.
ఎంఎఫ్ హుస్సేన్... ఈ రెస్టారెంట్ భోజనానికి ఫిదా అయి తన ట్రేడ్‌మార్క్ గుర్రాన్ని కాన్వాస్‌పై చిత్రించి ఇచ్చారు. అప్పటి నుంచి దీని ప్రతి రూపాన్ని ఆప్రాన్లపై ముద్రించి ముఖ్యఅతిథిలకు ఓ జ్ఞాపికగా అందిస్తోంది. ఇప్పుడు ట్రంప్‌కు కూడా దీనిని బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 8.46 లక్షల మంది రైతులకు రూ.50,850 కోట్లు