కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పట్ల ఉత్తర్ప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఓ జాతీయ పార్టీ నాయకుడిని అడ్డుకోవడమే కాక, ఆయన పట్ల దురుసుగా వ్యవహరించడాన్ని ఆక్షేపించారు. రాహుల్ కాలర్ పట్టుకుని నేలకు కొట్టారన్న రౌత్.. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన సామూహిక అత్యాచారమని వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అక్రమంగా నిర్మించిన కట్టడాలను బీఎంసీ అధికారులు.. కూల్చి వేసినప్పుడు మహారాష్ట్ర సర్కారే లక్ష్యంగా వ్యవహరించిన వారు.. ఇప్పుడేందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు రౌత్. అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో వచ్చిందని పోలీసులు చెప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు శివసేన ఎంపీ. తన మరణ వాంగ్మూలంలో బాధితురాలు అబద్ధం చెప్పిందా? అని ప్రశ్నించారు. హాథ్రస్ ఘటనపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు రౌత్.
మరోవైపు హాథ్రస్ ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ దక్షిణ ముంబయిలో శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఇదీ చూడండి: 'ఎవరికీ భయపడేది లేదు- అన్యాయానికి తలొగ్గను'