కాన్పుర్‌లో 8 మంది పోలీసులు హత్య ఘటన, కరుడుగట్టిన వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై విచారణ చేసేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకోసం అలహాబాద్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శక్తికాంత్ అగర్వాల్‌ను నియమించారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్. నివేదికి సమర్పణకు రెండు నెలలు గడువు ఇచ్చారు.
"గ్యాంగ్‌స్టర్‌తో పోలీసులకు, ఇతర ప్రముఖులకు ఉన్న సంబంధాలపై ఈ కమిషన్ దర్యాప్తు చేస్తుంది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తుంది."
-ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రకటన
జులై 2 నుంచి 10 వరకు జరిగిన అన్ని ఎన్కౌంటర్లపై ఈ కమిషన్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఇదీ కేసు...
ఉత్తర్‌ప్రదేశ్‌లో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులకు తెగబడి.. ఎనిమిది మందిని మరణానికి కారణమయ్యాడు గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. గ్యాంగ్‌స్టర్‌ను వెతకటం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొన్నిరోజుల తర్వాత మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ ప్రాంతంలో అతడిని అరెస్టు చేశారు పోలీసులు. దుబేను కాన్పుర్‌కు తరలిస్తుండగా వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా భద్రతా సిబ్బంది నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరపగా.. ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురుకాల్పుల్లో దుబే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
దుబేను పట్టుకోవటానికి పోలీసులు వస్తున్నట్లు సంబంధిత అధికారులే సమాచారం ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణకు ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఇదీ చూడండి:మావోయిస్టుల దుశ్చర్య- 12 అటవీశాఖ భవనాలు పేల్చివేత