కశ్మీర్ అంశంలో దౌత్యపరంగా కేంద్రం ఘోర పరాభవం చెందిందని కాంగ్రెస్ విమర్శించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) కశ్మీర్ అంశంపై చర్చించాలనుకోవడమే ఇందుకు నిదర్శమని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవలే చైనాలో పర్యటించినా ఇలా జరగడం వ్యూహాత్మక వైఫల్యమని దుయ్యబట్టారు.
భారత మిత్ర దేశాలను సంప్రదించి ఈరోజు రాత్రి జరగబోయే యూఎన్ఎస్సీ సమావేశాన్ని నిలిపివేసేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు సింఘ్వీ. ఈ సూచన చేసినందుకు తనను జాతి వ్యతిరేకిగా భాజపా చిత్రీకరిస్తుందేమోనని భయంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అంశంపై శుక్రవారం రాత్రి సమావేశం కానుంది యూఎన్ఎస్సీ. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ లేఖ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.