చైనా ఆర్మీ తమను తాము బాధ్యతాయుతమైన బలగాలుగా చెప్పుకుంటున్నప్పటికీ.. వారి సైనికుల ప్రవర్తన అలా లేదని భారత సైన్యాధికారులు తెలిపారు. ఇటీవల లద్ధాఖ్లోని ప్యాంగొంగ్ ట్సో సరస్సు ప్రాంతంలో భారత సైనికులతో ఘర్షణకు దిగినప్పుడు చైనా బలగాలు కర్రలు, ముళ్ల తీగలు, రాళ్లు ఉపయోగించినట్లు పేర్కొన్నారు అధికారులు. చైనా జవాన్ల ప్రవర్తన అత్యంత అనైతికంగా ఉందన్నారు.
" చైనా జవాన్ల ప్రవర్తన కశ్మీర్ లోయలో భారత భద్రతా దళాలపై రాళ్లదాడులు చేసే పాకిస్థాన్ ఆధారిత దుండగుల మాదిరిగా ఉంది. ప్యాంగొంగ్ ట్సో సరస్సు ప్రాంతంలో భారత బలగాలతో ఘర్షణకు దిగిన సందర్భంలో చైనా బలగాలు కర్రలు, ముళ్ల తీగలు, రాళ్లను ఉపయోగించాయి. ఆ సమయంలో చైనా సైనికుల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ ఉన్న భారత సైనికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వారి జవాన్లు అనైతిక ఆర్మీలా ప్రవర్తించారు. భారత సైన్యం మన పరిధిలోని ప్రాంతాల నుంచి చైనీయులను వెనక్కి పంపేందుకు ఎప్పుడూ అలాంటి వ్యూహాలను ఉపయోగించదు. "
- ఆర్మీ అధికార వర్గాలు
లద్ధాఖ్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాల సైనికుల వద్ద ఆయుధాలు ఉన్నప్పటికీ.. 1967 నుంచి ఇప్పటి వరకు ఒక్క తూటా పేలలేదు.
ఇటీవల ఇరు దేశాల మధ్య సరిహద్దులో పెరిగిన ఉద్రిక్తతలతో 5 వేలకు పైగా బలగాలను ఎల్ఏసీ వెంబడి మోహరించింది చైనా. అదే క్రమంలో భారత్ కూడా బలగాలను పెంచింది. ఎలాంటి చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తలు చేపట్టింది భారత్. ఉద్రిక్తత కొనసాగే ప్రమాదం ఉన్నందున సైనికులను తరలించేందుకు భారీ రవాణా విమానాలను వినియోగిస్తోంది.