అగ్రరాజ్య అధినేతకు ఘనంగా ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధమైంది. ఈ రోజు, రేపు జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో నిర్మించిన భారీ స్టేడియంలో 'నమస్తే ట్రంప్' కార్యక్రమం జరగనుంది. ఇరువురు దేశాధినేతలు స్టేడియంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంపై అందరి దృష్టి నెలకొంది.
ప్రధాని కలల స్టేడియం...
మోటేరా స్టేడియానికి 'సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం' అని పేరుమార్చారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్. ప్రధాని గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీనిని నిర్మించాలని సంకల్పించారు.
విశేషాలు...
నవీకరణ...
2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. 3 ప్రవేశ ద్వారాలతో 63 ఏకరాల్లో ఈ స్టేడియం ఉంది. ఇందులో ఒలింపిక్ స్థాయి ఈత కొలను, నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు, 75 కార్పొరేట్ బాక్స్‌లు ఉన్నాయి. ఇందులో ప్రధాన ప్రత్యేకత ఎల్ఈడీ దీపాలు. సాధారణంగా స్టేడియంలో ఉండే ఫ్లడ్‌లైట్లు కాకుండా ఇక్కడ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.
ఖర్చు...
ఈ స్టేడియం నిర్మాణానికి దాదాపు రూ. 719 కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఇందులో అత్యాధునిక డ్రెస్సింగ్ గదులు, ఫుడ్ కోర్ట్లు, ప్రతి స్టాండ్‌లోనూ ఆతిథ్య ప్రదేశాలు ఉన్నాయి. రెండు చిన్న క్రికెట్ ప్రాక్టీస్ మైదానాలు ఇక్కడ నెలకొన్నాయి.
ప్రధాన మైదానానికి బయట ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించని సమయంలో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్రికెట్ మాత్రమే కాకుండా బ్యాడ్మింటన్, టెన్సిస్ కోర్ట్లు, స్క్వేష్ అరెనా, టేబుల్ టెన్నిస్‌కు ప్రత్యేక ప్రదేశాలు, క్లబ్‌హౌస్ ఉన్నాయి.
సామర్థ్యం...
ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్దదైన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియం రికార్డ్‌ను మోటేరా తిరగరాసింది. మెల్బోర్న్ సామర్థ్యం లక్ష కాగా... లక్షా పది వేల సామర్థ్యంతో మోటేరా స్టేడియాన్ని నిర్మించారు.
అతిపెద్ద పార్కింగ్...
3 వేల కార్లు, 10 వేల ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి.
స్కైవాక్...
మోటేరా మెట్రో స్టేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా స్కైవాక్‌ను 2020 సెప్టెంబర్ తర్వాత పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయితే మెట్రో స్టేషన్ల నుంచి 300 మీటర్ల లోపే ప్రజలు ఇక్కడకు చేరుకోగలరు. రోడ్డు మార్గం ద్వారా వచ్చే అవసరం ఉండదు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: ఆతిథ్యం సరే.. మరి ఒప్పందాల మాటేంటి?