రక్షణ, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరపనున్నట్లు విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25న జరిగే ఈ భేటీలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
ట్రంప్ కోసం ప్రధాని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారీ విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తారని వెల్లడించారు.
తొందరేంలేదు
అయితే వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి ఇరుదేశాలు తొందరపడటం లేదని అధికారులు తెలిపారు. దీనిపై ఇరుపక్షాలు దీర్ఘకాల పరిష్కారానికే మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు. ట్రంప్ పర్యటనలో కొన్ని రక్షణ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.
ముగిసిపోలేదు..!
ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ముగిసిపోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత వాణిజ్య శాఖ, అమెరికా అధికారులు కలిసి సమాలోచనలు జరుపుతున్నట్లు స్పష్టం చేశాయి. రెండు దేశాల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించాయి. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.
సాధారణీకరణ ప్రాధాన్యాల వ్యవస్థ(జీఎస్పీ)ను పునరుద్ధరించాలని భారత్ కోరనున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ అంశంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదని స్పష్టం అధికార వర్గాలు స్పష్టం చేశాయి
కశ్మీర్‌పై చర్చల్లేవ్
దేశాధినేతల మధ్య కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసినట్లు గుర్తు చేశాయి. ట్రంప్ పర్యటనలో ఇండో-పసిఫిక్ ప్రాంతంపైనే అధిక దృష్టి ఉంటుందని వెల్లడించాయి.