డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో సెనేటర్‌తో పాటు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్... చైనాకు ఉద్యోగాలు తరలించారని ఆరోపించారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయిన తర్వాత తొలిసారి బహిరంగ ప్రసంగం చేశారు ట్రంప్. శ్వేతసౌధం బ్లూరూం బాల్కనీ నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా బైడెన్‌పై విమర్శలు గుప్పించారు.
బైడెన్ తన ఎన్నికల ప్రచారంలో దేశాన్ని సోషలిజం మార్గంలో తీసుకెళ్లే విధంగా మాట్లాడుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అది జరగనివ్వనని అన్నారు.
"డెమొక్రాట్లది సామ్యవాద కార్యక్రమం. నిజానికి సామ్యవాదానికి మించినది. (సభికుల్లో ఒకరు కమ్యునిస్టు అని అరవగా..) అవును కమ్యునిస్టులు. అది నిజం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
డెమొక్రాటిక్ పార్టీ 50 ఏళ్లుగా చైనాకు తరలించిన అమెరికన్ల ఉద్యోగాలను తమ ప్రభుత్వం తిరిగి తీసుకువచ్చిందని ట్రంప్ అన్నారు. తమ ప్రభుత్వం చైనాపై అధిక సుంకాలను విధించిందని ట్రంప్ గుర్తు చేశారు.
'ఆ ఘనత ట్రంప్‌దే'
మరోవైపు, ట్రంప్‌పై ప్రత్యారోపణలు చేశారు జో బైడెన్. ట్రంప్ కేవలం ధనికులు, బిలియనీర్ల ప్రయోజనాలనే కాపాడారని విమర్శించారు. ఆధునిక అమెరికా చరిత్రలో అతి తక్కువ ఉద్యోగాలు కల్పించిన అమెరికన్ అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారని బైడెన్ అన్నారు.
"అధ్యక్షుడు మనల్ని 'కే-షేప్' ఆర్థిక మాంద్యంలో పడేసి వెళ్తున్నారు. ధనికులు ఇంకా ధనికులుగా మారుతున్నారు. అమెరికాలోని తొలి వంద మంది బిలియనీర్లు ఈ సంవత్సరం 300 బిలియన్ డాలర్లను సంపాదించారు. మధ్యతరగతి, పేదవారు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు."
-జో బైడెన్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి