మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభంలో పడింది. పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులు సహా 17మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. సోమవారం భోపాల్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన ఎమ్మెల్యేలు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి.. అజ్ఞాతప్రదేశంలో మకాంవేశారు.
జ్యోతిరాదిత్య సింధియా... భాజపా తీర్థం పుచ్చుకుంటారని, ఆయన వర్గం మద్దతుతో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల ఎంపిక, ఇతర అంశాలపై అధిష్ఠానంతో చర్చించేందుకు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కమల్ నాథ్.. హస్తిన పర్యటన కుదించుకొని భోపాల్ తిరిగివచ్చారు. కేబినెట్ భేటీ నిర్వహించారు. అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా 20మంది మంత్రులు రాజీనామాలు సమర్పించగా వెంటనే వాటిని ఆమోదించారు. ఇవాళ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు.
గతవారమే మొదలు..
మధ్యప్రదేశ్‌లో రాజకీయడ్రామా గతవారమే మొదలైంది. కాంగ్రెస్‌కు చెందిన 10మంది ఎమ్మెల్యేలు అదృశ్యమై తర్వాత 8మంది తిరిగివచ్చారు. మిగతా ఇద్దరు బెంగళూరులో మకాం వేయగా తాజాగా 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ రంగంలోకి దిగినప్పటికీ.. ఎమ్మెల్యేలను కలవడానికి వీలుకాలేదు.
కొంతకాలంగా సీఎం కమల్‌నాథ్, సింధియా వర్గాల మధ్య జరుగుతున్న పోరాటం రాజ్యసభ ఎన్నికలతో పతాకస్థాయికి చేరింది. పార్టీలో పట్టుకోసం పోరాటం చేస్తున్న సింధియా రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అయితే కమల్‌నాథ్ వర్గం వ్యూహాత్మకంగా ప్రియాంక పేరును తెరపైకి తెచ్చినందున.. సింధియా సోనియాను కలవాలని భావించారు. అయితే అపాయింట్‌మెంట్ లభించనందున తిరుగుబాటు వ్యూహాన్ని అమలుచేసినట్లు తెలుస్తోంది.
నిశితంగా పరిశీలిస్తోన్న భాజపా
2018 శాసనసభ ఎన్నికల్లో 114 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్.. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ, ఓ ఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మధ్యప్రదేశ్ శాసనసభలో 230 స్థానాలు ఉండగా.. ఇద్దరు ఎమ్మెల్యేల మృతితో రెండుఖాళీగా ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 115గా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను భారతీయ జనతా పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇవాళ కమలం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.