త్రిపురలో ఇంటింటి సర్వే నిర్వహించేందుకు బయల్దేరిన వైద్య బృందాలకు కొన్ని గిరిజన గ్రామాల్లో చుక్కెదురైంది. కొవిడ్ పట్టణాల్లో మాత్రమే వ్యాపిస్తుంది.. గ్రామాల్లో కరోనా వైరస్ సోకే ప్రసక్తే లేదని.. వైద్య బృందాలు ఊర్లోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారు గ్రామస్థులు.
ఎవరెన్ని చెప్పినా వినం..
ఖోవాయి జిల్లాలోని ముంగియకామి, జుంబారి, తులశిఖర్, త్విమధు సహా మరికొన్ని గిరిజన గ్రామాలు.. వైద్య బృందాలను గ్రామాల్లోకి అనుమతించట్లేదు. దాదాపు 300 కుటుంబాలు నివసిస్తున్న ముంగియకాని గ్రామస్థులైతే ఏకంగా వచ్చిన అధికారులు వెనుదిరగాలని నిరసనకు దిగారు. రోడ్లకు కంచెలు వేశారు. జిల్లా స్థాయి అధికారులు, ఆరోగ్య శాఖ, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అంగీకరించట్లేదు.
"మేము నమూనాలు అందరి దగ్గరి నుంచి తీసుకోమని గ్రామస్థులకు వివరించాం. లక్షణాలున్నవారి దగ్గర మాత్రమే నమూనాలు తీసుకుంటామని చెప్పినా.. సర్వేకు వారు అంగీకరించలేదు. సర్వే ఇంకొన్ని రోజులు కొనసాగుతుంది. గ్రామస్థులు అంగీకరిస్తే.. నమూనాలు సేకరిస్తాం."
-స్మృతి మోల్, జిల్లా మేజిస్ట్రేట్
గ్రామంలో ఉదయం 10 గంటలకు రోడ్డుపై కంచెలు వేసి.. మధ్యాహ్నం 3 గంటలకు కంచె తీశారు కానీ, అధికారులను అనుమతించలేదన్నారు స్థానిక ఎస్ పీ కిరణ్ కుమార్. అయితే ప్రస్తుతం ఈ గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య లేదని.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
వారం రోజుల ఇంటింటి సర్వే సోమవారం ప్రారంభించింది త్రిపుర ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 1,59,854 ఇళ్లు తిరిగి స్క్రీనింగ్ నిర్వహించాయి వైద్య బృందాలు. వారిలో లక్షణాలున్న 2,271 మంది నమూనాలు సేకరించి పరీక్షించగా.. 90 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్థులు వైద్య పరీక్షలకు అంగీకరించకపోవడం అధికారులను కలవర పెడుతోంది.
త్రిపురలో మొత్తం 4,067 కొవిడ్ కేసులు నమోదవ్వగా.. 2,467 మంది కోలుకున్నారు. 17 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: ఔరా: ఆకాశంలోనే ఇంధనం నింపుకున్న 'రఫేల్'!