భారత సైనిక ఉన్నతాధికారులు దిల్లీలో నేటి నుంచి వారం రోజుల పాటు సమావేశం కానున్నారు. దేశం ఎదుర్కొంటున్న రక్షణ పరమైన సవాళ్లు... సైనిక వ్యవస్థ శక్తిని మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సదస్సును ప్రారంభించనున్నారు. భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో ఈ సమావేశాలు జరగనున్నాయి.
పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించనున్నారు సైనిక ఉన్నతాధికారులు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో వైమానిక దాడుల తర్వాత నెలకొన్న పరిస్థితుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అలాగే చైనా సరిహద్దులో రైల్వే లైన్లు, రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమాలోచనలు చేయనున్నారు.
సైనికుల సంక్షేమం కూడా చర్చకు రానుంది. ఇందులో ముఖ్యంగా మాజీ సైనికుల సహాయక ఆరోగ్య పథకం(ఈసీహెచ్ఎస్)పై చర్చించనున్నారు. సైన్యంలో పలు సంస్కరణల అమలుపైనా ఈ సమావేశంలో సమాలోచనలు చేయనున్నారు. నేటి నుంచి 14వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి.
ఇదీ చూడండి : అందరికన్నా ముందే ఓటేసిన జవాన్లు..!