మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు శాసనసభలకు పూర్తిస్థాయి, 16 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాలకూ ఉపఎన్నికలు జరగనున్నాయి. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార మైకులు మూగబోయాయి. రేపు ఉదయం నుంచే తమ హక్కును వినియోగించుకోనున్నారు ఓటర్లు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్నందున ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 24వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయి.
మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు మహారాష్ట్రలో 3 లక్షలు , హరియాణాలో 75 వేల మంది పోలీసులను మోహరించనున్నారు. అక్రమ మద్యం, నగదు రవాణాను అరికట్టేందుకు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా పెంచారు అధికారులు.
మహారాష్ట్రలో 3 లక్షల మంది...
మహారాష్ట్రలో 3 లక్షల మందికిపైగా పోలీసులను మోహరించనున్నారు అధికారులు. 2 లక్షల మంది రాష్ట్ర పోలీసులు కాగా, కేంద్ర నుంచి 350 కంపెనీల సిబ్బంది, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, నాగాలాండ్ మహిళా పోలీసు దళాల సేవలను వినియోగించుకోనున్నారు.మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావం ఉన్న గడ్చిరోలి జిల్లాలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా నిరంతరం శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
హరియాణాలో 75 వేల మంది...
సోమవారం జరిగే పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు హరియాణాలో 75 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరూ ఉల్లంఘించకుండా పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు.
'మహా' సంఖ్య..
288 స్థానాలు గల మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సుమారు 9 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొననున్నారు. 90 స్థానాలు గల హరియాణాలో కోటి 83 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహారాష్ట్రలో 288 స్థానాలకు సోమవారం ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.....3 వేల 237 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 94, 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8 కోట్ల 95 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
హరియాణా గణాంకాలు..
హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత ఎన్నికలు జరగనుండగా...1,069 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. కోటీ 83 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం 19 వేల 425 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
16 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు...
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 16 రాష్ట్రాల్లోని 51 శాసనసభ, 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, గుజరాత్, రాజస్థాన్ సహా వివిధ రాష్ట్రాల్లోని శాసనసభ నియోజకవర్గాల్లో గెలిచేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సమస్తీపుర్, మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ రేపు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24న వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: 'అన్ని భద్రతా కార్యాలయాల్లో వల్లభ్‌భాయ్ ప్రతిమ'