బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు అన్నీ ప్రతికూలంగా మారుతున్నాయి. కీలక నేతగా ఉన్న సువేందు అధికారి పార్టీ నుంచి వైదొలిగిన మరుసటి రోజే మరో శాసనసభ్యుడు శిలభద్ర దత్తా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం బైరక్పుర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదీ చూడండి: దీదీకి షాక్- ఎమ్మెల్యే పదవికి సువేందు రాజీనామా
''ప్రస్తుత పరిస్థితుల్లో నేను పార్టీలో కొనసాగలేను. ఎమ్మెల్యే పదవికి మాత్రం నేను రాజీనామా చేయలేదు. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. ఆ పదవి నుంచి తప్పుకుంటే ప్రజలు ఎక్కడికి పోతారు?''
- శిలభద్ర దత్తా, బైరక్పుర్ శాసనసభ్యుడు
ఒక్కరోజు వ్యవధిలో ముగ్గురు కీలక నేతలు టీఎంసీ నుంచి తప్పుకోవడం గమనార్హం. పార్టీ సీనియర్ నేత జితేంద్ర తివారి.. అసన్సోల్ మున్సిపల్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ అడ్మినిస్టేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. శనివారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బంగాల్ పర్యటన సందర్భంగా వీరంతా భాజపాలోకి చేరతారని ప్రచారం జరుగుతోంది. దత్తా కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మమత అత్యవసర సమావేశం..
పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడుతుండటంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్టీ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.