కరడుగట్టిన నేరస్థులు సైతం తిహార్ జైలంటే భయపడతారు. తప్పించుకునేందుకు వీలులేని ఆసియాలోనే సురక్షిత కారాగారంగా పేరుగాంచింది ఆ జైలు. అక్కడి మహిళా కారాగారంలోని ఆరో నెంబర్ గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మహిళా ఖైదీల కోసం బ్యూటీపార్లర్ ఏర్పాటు చేస్తున్నారు. దిల్లీలోని సౌందర్యశాలల్లో ఉండే సౌకర్యాలన్నీ తిహార్ బ్యూటీపార్లర్‌లో ఉంటాయి.
బ్యూటీపార్లర్ కోసం వేర్వేరు డిజైన్లను పరిశీలించారు. చివరకు ఒకదాన్ని ఎంపిక చేశారు. ఎంతో ఆకర్షణీయంగా బ్యూటీ పార్లర్‌ను తీర్చిదిద్దుతున్నారు.
ఖరీదూ తక్కువే...
బయట మార్కెట్లోని ధరలతో పోల్చితే అతితక్కువ ధరలకే ఖైదీలకు సౌందర్య సేవల్ని అందజేస్తామని చెబుతున్నారు జైలు అధికారులు. ఇప్పటివరకు తిహార్ జైలులో కేవలం హెయిర్ కటింగ్ సెలూన్ ఉండేది. అలంకరణకు సంబంధించిన సౌకర్యాలు లేవు. ఈ ఏర్పాటుతో తిహార్ జైల్లోని మహిళా ఖైదీలు తోటివారికి హెయిర్ కటింగ్ చేయడమే కాదు అందంగా ముస్తాబూ చేస్తారన్నమాట.
విన్నపాలు తీర్చేందుకే
ఈ నూతన పార్లర్లో ఒకేసారి ముగ్గురు నుంచి నలుగురు మహిళలకు సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హత్య, దారి దోపిడీ, దొంగతనం, మాదకద్రవ్యాల రవాణా వంటి తీవ్ర నేరాలే కాక ఇతర నేరాలు చేసిన వారు ఈ పార్లర్ కోసం అధికారులకు విజ్ఞప్తి చేశారట.