ప్లాస్టిక్ భూతాన్ని ఎలా నివారించాలో తెలియక ప్రపంచ దేశాలు సతమతం అవుతుంటే.. రాజస్థాన్ కోటా జిల్లా కేశవ్‌పుర గ్రామ ప్రజలు మాత్రం చిటికెలో ఆ పని చేసేశారు. ప్రధాని మోదీ పిలుపుకంటే ముందే ప్లాస్టిక్ వాడకాన్ని జులైలోనే నిషేధించారు.
మూగజీవాల మరణంతో..
నోరులేని మూగజీవాలు ప్లాస్టిక్ వస్తువులను తిని చనిపోతుండటం చూసి చలించిపోయారు కేశవ్‌పుర వాసులు. ఎలాగైనా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి.. ఈ భూతాన్ని ఊరి నుంచి తరిమికొట్టాలనుకున్నారు. ఇందుకోసం ఈ ఏడాది జులై 11న గ్రామ ప్రజలంతా కలిసి కేశవ్పుర్లోని ప్లాస్టిక్ పదార్థాలు సేకరించారు. ఆ వ్యర్థాలను ఓ గొయ్యిలో వేసి నిప్పుపెట్టారు. భవిష్యత్‌లో ఎప్పుడూ ప్లాస్టిక్ వినియోగించమని ప్రతిజ్ఞ పూనారు.
"ఆవులు, గేదెలు తరచూ గ్రామం చుట్టుపక్కల ఉండే ప్లాస్టిక్ వస్తువులు తిని అనారోగ్యం పాలయ్యేవి. అందుకే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను తరిమి కొట్టాలని సంకల్పించాం. ఊరు చుట్టుపక్కల ఉన్న ప్లాస్టిక్‌ను ఒకేచోటకు చేర్చి తగలబెట్టాం."
- కేశవ్‌పుర గ్రామస్థుడు
దేశానికే ఆదర్శం..
ప్రజల అంగీకారంతో కేశవ్పురలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది ఆ గ్రామ అభివృద్ధి కమిటీ. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో భోజనాల సందర్భంగా కూడా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడకూడదని తీర్మానించింది. ఈ నిర్ణయం తర్వాత ఇప్పటివరకు 11 వేడుకలు జరిగినా... ఎక్కడా ప్లాస్టిక్ జాడలేదు.
ఆఖరికి చెత్త సేకరణకు ప్లాస్టిక్ బుట్టల స్థానంలో లోహ డబ్బాలను తీసుకొచ్చింది కేశవ్పుర్ గ్రామ అభివృద్ధి కమిటీ. షాపింగ్‌కు వెళ్లేందుకు సైతం కాగితం లేదా వస్త్ర సంచులను మాత్రమే వినియోగిస్తారు ఇక్కడి ప్రజలు.