మహారాష్ట్ర శాసనసభ ఫలితాలు వెలువడి వారం రోజులు కావస్తున్నా ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. భాజపా-శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చినా సీఎం పగ్గాలు ఎవరు చేపట్టాలనే విషయమై ఇరుపార్టీల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. వీటిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర ప్రస్తుత శాసనసభ గడువు వారం రోజుల్లో ముగియనుంది. అప్పటిలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలన వస్తుందనే ప్రచారం మొదలైంది.
రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు
ఈనెల 7వరకు.. కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలన వస్తుందని మహారాష్ట్ర ఆర్థిక మంత్రి, భాజపా సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ ఇటీవల తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఊహాగానాలపై శాసనసభవర్గాలు స్పందించాయి. ప్రస్తుత శాసనసభ గడువు ఈనెల 9తో ముగియనుంది. అయితే అప్పటివరకూ కొత్త ప్రభుత్వం ఏర్పడకపోయినా వెంటనే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేవని శాసనసభ వర్గాలు తెలిపాయి.
గవర్నర్ శాసనసభను సమావేశపరుస్తారు
కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానీ పరిస్థితుల్లో గవర్నర్ భగత్‌సింగ్ కొషియారీ శాసనసభను సమావేశపరుస్తారని శాసనసభ వర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను గవర్నర్‌కు సమర్పించినందున గత నెల 25నే 14వ శాసనసభ ఏర్పడినట్లేనని శాసనసభ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించేందుకు.....గవర్నర్ శాసనసభను సమావేశపర్చవచ్చన్నారు. సాధారణంగా కేబినెట్ సిఫారసు మేరకు గవర్నర్ శాసనసభ సమావేశాల ప్రారంభానికి నోటిఫికేషన్ జారీ చేస్తారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి, మంత్రిమండలి లేనందున.... గవర్నరే శాసనసభను సమావేశపర్చవచ్చని శాసనసభ కార్యాలయవర్గాలు అంటున్నాయి.
గతంలోనూ ఇదే తరహా...
మహారాష్ట్రలో కొత్త సర్కార్ ఏర్పాటు ఆలస్యం కావటం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. 1999, 2004, 2009లో కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య అధికార పంపిణీ ఒప్పందంపై అవగాహన కుదరక కొత్త ప్రభుత్వం ఏర్పాటు రెండువారాల పాటు ఆలస్యమైంది. 1999లో శరద్ పవార్ నేతృత్వంలో కొత్తగా ఆవిర్భవించిన ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం పదవీ, మంత్రుల అంశంపై ఇరుపార్టీల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్ నేత దివంగత 'విలాస్‌రావు దేశ్‌ముఖ్' ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.
2004లోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది. గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన ఎన్సీపీ ముఖ్యమంత్రి పదవి కోసం మళ్లీ పట్టుపట్టింది. చివరికి రెండు మంత్రి పదవులను అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకుంది. 2009లోనూ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యమైంది. 2004లో ఎన్సీపీకి ఇచ్చిన రెండు అదనపు శాఖల కోసం కాంగ్రెస్ పట్టుబట్టింది.
కైవసం చేసుకున్న స్థానాలు
288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 105, శివసేన 56 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీ సాధించాయి. ఎన్సీపీ 54, మిత్రపక్షం కాంగ్రెస్ 44 సీట్లు సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు 145.
ఇదీ చూడండి : 'మహారాష్ట్రలో నవంబర్ 7 తరువాత రాష్ట్రపతి పాలన!'