భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై ఉన్న లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. ఆయనపై ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థినిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అరెస్టు చేశారు. చిన్మయానంద్ నుంచి అక్రమంగా డబ్బు దండుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందుకే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర ప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్‌లో చిన్మయానంద్‌కు చెందిన ఓ కళాశాలలో న్యాయ విద్యనభ్యసిస్తున్న తనను... బ్లాక్‌మెయిల్ చేసి ఆయన పలుమార్లు అత్యాచారం చేశారని ఆరోపిస్తూ గత నెల 24న ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేసింది ఆ యువతి. అందుకు సంబంధించిన వివరాలను విచారణ సమయంలో పోలీసులకు అందజేసింది.
ఈ నెల 20న అరెస్టు
ఈ కేసు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ బృందం చిన్మయానంద్‌ను పలుమార్లు విచారించింది. అనంతరం ఆయనను ఈ నెల 20న ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజాన్‌పుర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్మయానంద్‌ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.