మహిళలపై ఘోరాలూ నేరాలూ అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో రెండు రోజల క్రితం (డిసెంబరు 14) పద్దెనిమిదేళ్ల అమ్మాయిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడటమే కాగా కిరోసిన్ గుమ్మరించి నిప్పంటించిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపరచింది. కాన్పూర్‌లోని ఓ వైద్యశాలలో 90శాతం కాలిన గాయాలతో బాధిత మహిళ కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషాదం గుండెల్ని మెలిపెడుతోంది. ఫతేపూర్ దారుణం చోటుచేసుకున్న రోజే దేశవ్యాప్తంగా మహిళలపై రమారమి వంద అత్యాచార ఘటనలు జరగడం గమనార్హం. యావద్దేశాన్ని కలచివేసిన ‘నిర్భయ’ హత్యాచార ఘటన జరిగి ఏడేళ్లవుతున్న తరుణంలో భారతావనిలో మహిళల కన్నీటి ఘోష మరింత విస్తరిస్తోందన్న సత్యాన్నే వెల్లడిస్తున్న పరిణామాలివి.
‘నిర్భయ’ కేసులో నలుగురు నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదు. వారికి ఉరిశిక్ష పడుతుందా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. నిందితుల్లో ఒకరు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ అనంతరం డిసెంబరు 18న ఈ కేసు న్యాయస్థానం ముందుకు రానుంది. భాజపా మాజీ శాసనసభ్యుడు కుల్దీప్ సింగ్ సెంగర్‌తోపాటు అతగాడి సన్నిహితులకూ ప్రమేయం ఉన్న ఉన్నావ్ అత్యాచారం కేసుపైనా ఇవాళే తుది తీర్పు వెలువడే అవకాశం ఉందంటున్నారు. కేసులు, విచారణలు, శిక్షలతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా అత్యాచారాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. కిందటి నెల దేశవ్యాప్తంగా భీతావహ హత్యాచార ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. విస్తరిస్తున్న ఈ అత్యాచార సంస్కృతికి ప్రభుత్వాలుగానీ, సామాజిక కట్టుబాట్లు గానీ అడ్డుకట్టవేయలేకపోతుండటం బాధాకరం.
గణాంకాలు
జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వివరాల ప్రకారం 2017లో దేశంలో 33,885 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దాని ప్రకారం సగటున ప్రతి రోజూ 93 మంది మహిళలు బాధితులవుతుండగా, వారిలో మూడోవంతు మైనర్లు కావడం భయపెడుతున్న పరిణామం. 2017లోనే 88వేల మంది మహిళలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ లెక్కన సగటున రోజూ 240 మంది మహిళలు లైంగిక వేధింపుల పాలబడుతున్నారన్నమాట! కిందటి నెల హైదరాబాద్ సమీపంలో ‘దిశ’ హత్యాచార ఘటన, అనంతరం ఉన్నావ్‌లో సాక్ష్యం చెప్పేందుకు న్యాయస్థానానికి వెళుతున్న అత్యాచార బాధిత మహిళపై కిరోసిన్ పోసి కాల్చి చంపిన దురన్యాయం, పట్నా కళాశాలలో 20ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం... ఇలా చెప్పుకొంటూపోతే ఈ దుశ్శాసన పర్వానికి అంతూ పొంతూ ఉండదు!
ఎండమావిగ మారిన న్యాయం
‘దిశ’ హత్యాచార కేసులో నిందితుల ‘ఎన్‌కౌంటర్’ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపింది. ఏళ్లూ పూళ్లూ నాన్చకుండా ఘోరానికి తెగబడినవారిపట్ల సరైన విధంగా స్పందించి పోలీసులు ‘తక్షణ న్యాయం’ అందించారని మెజారిటీ ప్రజలతో పాటు అధికారస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యధికులూ అభిప్రాయపడ్డారు. నిజానిజాలను నిగ్గుతేల్చే విచారణ, న్యాయస్థానం తీర్పులతో నిమిత్తం లేకుండా పోలీసులే ఎక్కడికక్కడ ఈ తరహా ‘మూక న్యాయానికి’ ఆరంభం పలకడం వ్యవస్థల పతనానికి తార్కాణమన్న వాదన కూడా మరోవైపు గట్టిగా వినిపిస్తోంది. సత్వర న్యాయం ఎండమావిగా మారడమే ఈ దురవస్థకు కారణం.
ప్రశ్నార్థకం
దేశంలో యాభయ్యేళ్లుగా ఎటూ తేలని కేసులూ ఉన్నాయి. మొత్తంగా దేశంలోని న్యాయస్థానాల్లో 3.3 కోట్లకుపైగా కేసులు పెండింగులో ఉన్నాయి. వ్యవస్థాగత లోపాలు న్యాయాన్ని అన్యాయం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధ పాలన అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. పురుషస్వామ్య భావజాలం జాతి అణువణువునా విస్తరించి ఉండటంవల్ల మహిళలపై హింస తప్పుపట్టాల్సిన అవసరంలేని విషయంగా మారిపోయింది.
ఆలోచనలో మార్పురావాలి
సామాజిక ఆలోచన పునాదులు మారితే తప్ప ఈ అత్యాచార సంస్కృతికి ముకుతాడువేయడం కుదిరే పనికాదు. తప్పుచేసిన వారు ఎంత పెద్దవారైనా గట్టి చర్యలు తీసుకునే దృఢమైన రాజకీయ సంకల్పమూ నేరాలకు చాలావరకు అడ్డుకట్ట వేయగలుగుతుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో మహిళలపై హింసకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్నవారి జాబితాను ఇటీవల ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) సంస్థ వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో (ఎంపీలు, ఎమ్మెల్యేలు) ప్రజా ప్రతినిధుల వివరాలను ఆ సంస్థ బయటపెట్టింది. 2009-2019 మధ్యకాలంలో మహిళలపై హింసకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న లోక్‌సభ సభ్యుల సంఖ్య 850శాతం పెరిగింది! ప్రజాస్వామ్యానికి పెద్దదిక్కుగా వ్యవహరించి, నేరగాళ్లకు సింహస్వప్నంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే పెద్దయెత్తున నేరాలకు పాల్పడుతుండటం దిగ్భ్రాంతపరుస్తోంది.
నాయకులే నేరస్థులు..!
ప్రధాన రాజకీయ పార్టీల్లో 21 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులతో భాజపా మొదటి స్థానంలో నిలుస్తుండగా; 16మందిపై కేసులతో కాంగ్రెస్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులతో వైఎస్‌ఆర్‌సీపీ మూడో స్థానంలో నిలుస్తోంది. దేశంలో క్రమేణా విస్తరిస్తున్న అత్యాచార సంస్కృతికి విరుగుడు కనిపెట్టి, మహిళలపై హింసను సమర్థంగా కట్టడి చేయాల్సిన స్థానాల్లో ఉన్నవారే ఇన్నిన్ని కేసులు ఎదుర్కొంటుండటం విస్మయం కలిగిస్తోంది. రక్షణ కొరవడి దేశంలో సగటున రోజూ సుమారు 350 మంది మహిళలు అత్యాచారం, వేధింపుల సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ- మృగాళ్లకు బుద్ధిచెప్పే మేలిమి సంకల్పం రాజకీయ స్థాయిలో వ్యక్తం కాకపోవడానికి అసలు కారణాలనూ ‘ఏడీఆర్’ నివేదికలోని వాస్తవాలు కళ్లకు కడుతున్నాయి.
సి.ఉదయ్‌భాస్కర్
ఇదీ చూడండి : సర్కార్ వైఫల్యం.. గ్రామాలకేవీ మంచినీళ్లు?