శాస్త్ర, ఆవిష్కరణ రంగాల్లో పెట్టుబడి పెట్టే సమాజాలే భవిష్యత్తును తీర్చిదిద్దుతుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముందస్తుగా ఈ రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా సరైన సమయంలో ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం ప్రారంభోత్సవంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు మోదీ.
భారత్లో పటిష్ఠ, సమర్థమంతమైన శాస్త్రీయ రంగం ఉందని మోదీ పేర్కొన్నారు. దేశానికి తలమానికమైన శాస్త్రీయ సంస్థలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా కరోనాతో పోరాడుతున్న సమయంలో భారత్కు ఇవన్నీ గొప్ప ఆస్తులని అన్నారు. కరోనా నియంత్రణ నుంచి సామర్థ్యం పెంపు వరకు ఈ సంస్థలు అద్భుతాలు చేశాయని కొనియాడారు.
భారత్లో ఈ సమావేశం ప్రత్యక్షంగా జరగాల్సింది. కానీ పరిస్థితులు మారిపోవడం వల్ల వర్చువల్గా నిర్వహించుకుంటున్నాం. ఇదీ సాంకేతికతకు ఉన్న శక్తి. ప్రపంచ మహమ్మారి కూడా మనల్ని వేరు చేయలేకపోయింది.
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగుతున్న ఈ సమావేశంలో.. విధానకర్తలు, శాస్త్రవేత్తలు భాగస్వామ్యం కానున్నారు. ఈ వార్షిక సమావేశాన్ని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, శాస్త్ర సాంకేతిక శాఖ, ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, గ్రాండ్ ఛాలెంజెస్ కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అండ్ వెల్కం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కరోనా అనంతరం సుస్థిర అభివృద్ధి సాధించేందుకు అవసరమైన కీలక అంశాల గురించి ఈ వేదికపై చర్చించనున్నారు. ఇందుకు 40 దేశాలకు చెందిన 1600 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇదీ చదవండి- త్వరలోనే సీఏఏ అమలు చేస్తాం: నడ్డా