మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా తమిళనాడు ఐఏఎస్ అధికారి కోర్లపాటి సత్యగోపాల్ ప్రవేశపెట్టిన 'క్లయిమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్- వాటర్ కన్జర్వింగ్ రూట్ జోన్ ఇరిగేషన్ టెక్నిక్' (సీఆర్ఏ) పద్ధతి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తక్కువ నీటితో ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెంచడమే కాక, అధిక దిగుబడి సాధిస్తున్నారు కర్షకులు.
ఈ పద్ధతి ద్వారా మొక్క వేళ్ల వరకు నీరు చేరి త్వరగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ పద్ధతిని తమిళనాడులో ఎక్కువ మంది రైతులు అనుసరిస్తున్నారు.
సీఆర్ఏ విధానం...
సంప్రదాయ పద్ధతులతో పోల్చితే 'సీఆర్ఏ-రూట్ జోన్' పద్ధతి ద్వారా నాటిని మొక్కల పెరుగుదలలో ఒక విశిష్ట పురోగతి కనిపిస్తోంది. ఈ పద్ధతిలో రెండు అడుగుల సమాన పొడవు, వెడల్పు, లోతుతో గుంతను తవ్వాలి. అందులో నాలుగు అంగుళాల వ్యాసార్థం గల పీవీసీ పైపు పట్టే విధంగా ఓ మూలకు ఒక అడుగు లోతుతో చిన్న రంధ్రం చేయాలి. వ్యవసాయ భూమిలోని మట్టి స్వభావాన్ని బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రంధ్రాలు చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత జల్లెడ పట్టిన వర్మీ కంపోస్టు ఎరువును రెండు గుప్పిళ్లు ఆ రంధ్రాల్లో పోయాలి. దానిపై ఇసుక వేసి రంధ్రాన్ని మూసివేయాలి. పీవీసీ పైపులను మూలల్లో చేసిన రంధ్రాలపై ఏర్పాటు చేయాలి. అనంతరం మట్టితో కంపోస్టు ఎరువును కలిపి గుంతను మూడొంతల వరకు పూడ్చాలి. గుంత మధ్యలో ఒక అడుగు లోతు రంధ్రం చేసి అందులో కంపోస్టు ఎరువును వేయాలి. దానిపై మొక్క నాటాలి. ఆ తర్వాత గుంతను పూర్తిగా పూడ్చాలి. పీవీసీ పైపుల లోపల రెండు గుప్పిళ్ల ఎరువు పోసి ఇసుకతో లేదా నీటిని తేలికగా పీల్చుకోగలిగే పదార్థంతో నింపాలి.
అనంతరం జాగ్రత్తగా పీవీసీ పైపులను తొలగించి మొక్క చుట్టు సరిపడా నీరు పోయాలి. ఈ నూతన పద్ధతి ద్వారా నాలుగు మూలల నుంచి నీరు రెండు లేక మూడు అడుగుల లోతు వరకు చాలా తేలికగా వ్యాపిస్తుంది.
సీఆర్ఏ పద్ధతిలో మొక్కలు నాటి వ్యవసాయం చేయటం వల్ల వేడివల్ల ఆవిరైపోయే నీటిని ఆదా చేయొచ్చు. నీరు మొక్క వేరు వరకు చేరి పెరుగుదల అధికంగా ఉంటుంది.
ఇదీ చూడండి: 2వేల మంది రాజ్పుత్ వనితల 'తల్వార్ రాస్'