జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) నవీకరణ ప్రక్రియలో ఎలాంటి పత్రాలను సేకరించబోమని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ నంబర్‌ను వెల్లడించడం కూడా పౌరుల ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపింది. లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
జాతీయ జనాభా పట్టిక నవీకరణ ప్రక్రియకు సంబంధించి ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకుల కోసం సూచనలతో కూడిన పుస్తకాన్ని తయారుచేశామని చెప్పారు రాయ్.
ఎన్పీఆర్ నవీకరణ ప్రక్రియలో ఎవరి పౌరసత్వంపైనైనా అనుమానం వచ్చినప్పటికీ ఎలాంటి తనిఖీలు చేపట్టమని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి సమాచారాన్ని సేకరిస్తామన్న మంత్రి ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి నమ్మకంతో వివరాలు సమర్పించవచ్చని అన్నారు.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్పీఆర్ ప్రక్రియను ప్రారంభించనుంది.