అధికరణం-370 రద్దు అనేది ముగిసిన కథ అని సుప్రీంకోర్టులో కేంద్రం స్పష్టీకరించింది. ఆ సత్యాన్ని అంగీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయమేదీ లేదని తేల్చిచెప్పింది. భారత్‌లో జమ్ము-కశ్మీర్ విలీనం కానే కాలేదన్న వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అధికరణం-370 రద్దు రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ గురువారం ఈ మేరకు వాదనలు వినిపించారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు.
తిప్పికొట్టిన వాదనలు
భారత్‌లో జమ్ము-కశ్మీర్ విలీనం కాలేదని, అలాంటి ఒప్పంద పత్రాలేవీ లేవని పిటిషన్‌దారులు వినిపిస్తున్న వాదనలను వేణుగోపాల్ గట్టిగా తిప్పికొట్టారు. అవి నిష్ఫలమైన మాటలని వ్యాఖ్యానించారు. అసలు జమ్ము-కశ్మీర్ భారత్‌లో కలవకపోయి ఉంటే, అధికరణం-370 వచ్చేదే కాదని పేర్కొన్నారు. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కార్యదర్శి వి.పి.మేనన్ రాసిన ‘ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్’ పుస్తకంలోని అంశాలను ఉటంకించారు.
జమ్మూ-కశ్మీర్ విలీన పత్రంపై మహారాజా హరిసింగ్ సంతకం చేశారని, దాని సార్వభౌమత్వం తాత్కాలికమైనదేనని అందులో ఉందని గుర్తుచేశారు. పాకిస్థాన్‌తో హరిసింగ్ యథాస్థితి ఒప్పందం కుదుర్చుకున్నారని.. అయితే, దాన్ని ఉల్లంఘించి కశ్మీర్‌పై దాడికి పాక్ గిరిజనులను పంపించిందని తెలిపారు. వారంతా పాక్ సైన్యం వద్ద శిక్షణ పొందినవారేనని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తనతోపాటు రాష్ట్రాన్నీ రక్షించుకునేందుకు హరిసింగ్ భారత్‌తో విలీన పత్రంపై సంతకం చేశారని గుర్తుచేశారు. ఆ వెంటనే గిరిజనులను భారత సైన్యం వెనక్కితిరిగేలా చేసిందని పేర్కొన్నారు.
వాళ్ల రాజ్యాంగంలోనే ఉంది
జమ్ము-కశ్మీర్ సొంత రాజ్యాంగాన్ని తయారుచేసుకోవడానికి చాలాకాలం ముందే భారత రాజ్యాంగంలోని పలు నిబంధనలు అక్కడ వర్తించేవని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. జమ్ము-కశ్మీర్ రాజ్యాంగ పీఠికను స్వయంగా చదివి వినిపించారు. ఆ రాష్ట్రం(ఒకప్పటిది) భారత్‌లో అంతర్భాగమని దాని రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉందని, కాబట్టి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ప్రసక్తే తలెత్తదని చెప్పారు.
ఆ తీర్పులు వేర్వేరు అంశాలకు సంబంధించినవి
అధికరణం-370కి సంబంధించి ప్రేమ్‌నాథ్ వర్సెస్ జమ్మూ-కశ్మీర్(1959), సంపత్ ప్రకాశ్ వర్సెస్ జమ్ముకశ్మీర్(1970) కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయంటూ పిటిషన్‌దారులు వాదించడాన్ని వేణుగోపాల్ తప్పుపట్టారు. రెండు వేర్వేరు అంశాలకు సంబంధించిన తీర్పులుగా వాటిని పేర్కొన్నారు. పిటిషన్‌దారులు కోరినట్లు ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి విచారణ బాధ్యతను అప్పగించాల్సిన అవసరం లేదని సూచించారు. జమ్ము-కశ్మీర్ తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా వేణుగోపాల్ వాదనలతో ఏకీభవించారు. దీంతో తాజా పిటిషన్లను విస్తృత స్థాయి ధర్మాసనానికి అప్పగించే విషయంపై తీర్పును ధర్మాసనం రిజర్వులో ఉంచింది. ఈ విషయంలో సమగ్ర ఉత్తర్వు జారీ చేస్తామని వెల్లడించింది.
ఇదీ చూడండి: 3వ తరగతి విద్యార్థికి 450 గుంజీల శిక్ష- టీచర్‌పై కేసు