సాంకేతికత వేగంగా మారిపోతున్న ప్రస్తుత కాలంలో నేర్చుకోవడం చాలా ముఖ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతిగా గత రెండేళ్లలో ప్రజలతో గడిపిన క్షణాలను...ఆయన 'లిజనింగ్-లెర్నింగ్-లీడింగ్' పుస్తకరూపంలో మలిచారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికలో ఈ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆవిష్కరించారు.
రెండేళ్లలో తాను ఏం చేశానో ప్రజలకు చెప్పడానికే ఈ పుస్తకాన్ని రచించినట్లు వెంకయ్య తెలిపారు. భాజపాకు దూరం అవుతానన్న బాధతోనే ప్రారంభంలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపలేదని ఆయన వెల్లడించారు. 2019లో నరేంద్రమోదీని ప్రధాని పదవిలో చూసిన తరువాత రాజకీయాల నుంచి వైదొలగి స్వగ్రామానికి వెళ్లాలని భావించినట్లు వెంకయ్య తెలిపారు.
"నేర్చుకోవడం అన్నది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ప్రపంచమే ముందుకు వెళుతోంది. ప్రపంచం ఇప్పుడు ఓ కుగ్రామం. కొత్త సాంకేతికత, కొత్త ఆలోచనలు, కొత్త సృజనాత్మకతలు పుట్టుకొస్తున్నాయి. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. అందుకే కొత్త అంశాలు ఉద్భవిస్తాయి. వాటిని మనం స్వీకరించాలి. మనం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే శకంలో ఉన్నాం. అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. మనం నేర్చుకుంటూ ఉండాలి. ప్రజలతో రెండేళ్లు నేను గడిపిన సందర్భాలను ఆవిష్కరించాలని నేను భావించాను. చేసింది ప్రజలకు వివరించడం మన బాధ్యత. ప్రజాస్వామ్యంలో చేసింది ప్రజలకు చెప్పాలి. రాజకీయాల్లో కూడా ప్రజల వద్దకు వెళ్లి తీర్పును అడుగుతారు. కాని నా వద్ద అలాంటి పరిస్థితి లేదు. నేను రాజకీయాల వెలుపల ఉన్నాను. రాజకీయాల్లోకి తిరిగి రావాలని భావించడం లేదు. ఎన్నికల్లో పోటీ కూడా చేయబోవడం లేదు."
- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఈ సందర్భంగా వెంకయ్యనాయుుడు గొప్పదనంపై హోంమంత్రి అమిత్షా ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లోని యువనేతలకు వెంకయ్య జీవితం ఆదర్శమని అమిత్షా కొనియాడారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రకాశ్ జావడేకర్, సినీనటుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సోనియా ఎన్నికపై భాజపా వ్యంగ్యాస్త్రాలు