దిల్లీ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే లుటెన్స్ ప్రాంతంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి దగ్గరలో బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో దుండగులు ఐఈడీని ఉపయోగించారని పోలీసులు ప్రకటించారు. తక్కువ తీవ్రత కలిగిన ఈ బాంబు ధాటికి కొన్ని కార్లు దెబ్బతిన్నాయని తెలిపారు.
దిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్‌లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడుకు సంబంధించి సాయంత్రం 5.11 గంటల ప్రాంతంలో అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి మూడు ఫైర్ ఇంజన్లను తరలించారు.
ఇది చాలా తక్కువ తీవ్రత కలిగిన బాంబు మాత్రమే. అలజడి సృష్టించేందుకు కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నంగా భావిస్తున్నాం. సమీపంలో నిలిపిన మూడు కార్ల అద్దాల ధ్వంసం అవడం మినహా.. వ్యక్తులెవరికీ గాయాలు కాలేదు. ఆస్తి నష్టం జరగలేదు.
-అనిల్ మిత్తల్, దిల్లీ పోలీస్ అదనపు ప్రజా సంబంధాల అధికారి.
రాజ్‌పథ్ వద్ద బీటింగ్ జరుగుతున్న రిట్రీట్ కార్యక్రమానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
అప్రమత్తం
దిల్లీలో పేలుడు దృష్ట్యా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.