అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని భారత సైన్యం వెల్లడించింది. 44వ జాతీయ రహదారి వెంబడి దాడికి ప్రణాళిక రచిస్తున్నారని 9 రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్ కమాండర్, బ్రిగేడియర్ వీఎస్ ఠాకూర్ తెలిపారు. అయితే యాత్రను శాంతియుతంగా నిర్వహించేలా పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
"యాత్రను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాదులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని మాకు సమాచారం అందింది. కానీ యాత్రకు ఎలాంటి అవరోధాలు లేకుండా, శాంతియుతంగా జరిపేలా మా వద్ద అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి."
-బ్రిగేడియర్ వీఎస్ ఠాకూర్, 9 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండర్
దక్షిణ కశ్మీర్ గుల్గాం జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు బ్రిగేడియర్ ఠాకూర్ తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన వాలీద్ సైతం ఇందులో హతమైనట్లు చెప్పారు. యాత్ర ప్రారంభానికి ముందు భద్రతా దళాలకు ఇది పెద్ద విజయంలాంటిదని అన్నారు.
ఆగస్టు 21 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.