నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ముష్కరులు నక్కిఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టింది భారత సైన్యం. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమయ్యాడు.
తొలుత పుల్వామా జిల్లా పాంపోర్‌లో భారత దళాలకు.. ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందింది. నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. దీటుగా తిప్పికొట్టిన భద్రతా సిబ్బంది ఒకరిని మట్టుబెట్టింది. తప్పించుకునేందుకు మరో ఉగ్రవాది మసీదులోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అనంతరం.. షోపియాన్ జిల్లా మునంద్ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ చెలరేగింది. ముష్కరుల దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.
బుధవారం రాత్రి అనంత్‌నాగ్‌లో చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఇమ్రాన్ నబీ అనే ఉగ్రవాదిని పట్టుకుంది భారత సైన్యం. అతని నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు సిబ్బంది.
కాల్పుల విరమణ...
ఇదే సమయంలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి మచ్చిల్ సెక్టార్ వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘించింది దాయాది దేశం. పాక్ దళాలు మోర్టార్ షెల్లను ప్రయోగించినట్లు సైన్యం తెలిపింది. ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి భారత బలగాలు.
ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం