దేశవ్యాప్తంగా 2017లో నమోదైన కేసుల్లో తెలుగు రాష్ట్రాల వాటా 8.2 శాతంగా ఉందని జాతీయ నేర నమోదు విభాగం(ఎన్సీఆర్బీ) తెలిపింది. క్రైమ్స్ ఇన్ ఇండియా-2017 పేరుతో తాజాగా నివేదిక విడుదల చేసింది ఎన్సీఆర్సీబీ.
ఈ జాబితాలో 10.1 శాతంతో ఉత్తర్‌ప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తరువాతి స్థానంలో ఉన్నాయి. మెట్రో నగరాల్లో 40.4 శాతంతో దిల్లీ టాప్‌లో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీగానే కేసులు
2017లో దేశం మొత్తం 30,62,579 నేరాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2016లో 29,75,711.. 2015లో 29,49,400గా ఉంది. 2016తో పోలిస్తే 2017లో నేరాల్లో 11శాతం పెరుగుదల ఉంది.
ఇందులో ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే సుమారు 3.1లక్షల కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 4.3శాతం అంటే 1,23,336 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 3.9శాతంతో 1,19,858 కేసులు వచ్చాయి.
మెట్రో నగరాల్లో దిల్లీ
మెట్రో నగరాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీ మొదటి స్థానంలో ఉంది. పరిగణనలోకి తీసుకున్న 19 మెట్రో నగరాల్లోని జాబితాలో దిల్లీలో 40.4శాతంతో 2,13,141 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 2.7 శాతంతో 14,462 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో..
కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే ఎన్సీఆర్బీ ఏటా నేరాల రేటును గణిస్తుంది. ఐపీసీతోపాటు స్థానిక, ప్రత్యేక చట్టాలను అనుసరించిన కేసులను లెక్కిస్తుంది. అయితే ఐపీసీని మాత్రమే అధికారిక నేరశిక్షాస్మృతిగా పరిగణిస్తున్నాం.
ఇదీ చూడండి:రేప్ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్మెంట్ థియరీ'