అక్రమ హోర్డింగ్‌ల విషయంలో తమిళనాడు ప్రభుత్వ తీరుపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓ యువతి హోర్డింగ్ కారణంగా మరణించిన నేపథ్యంలో.. ఇలా మరెన్ని ప్రాణాలు కోల్పోవాలంటూ ఆవేదన వెలిబుచ్చింది న్యాయస్థానం. అనధికార బ్యానర్ల తొలగింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుందా? లేదా? అని హైకోర్టు ఫ్లెక్సీలకు సంబంధించిన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రశ్నించింది.
"రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎన్ని లీటర్ల రక్తంతో రహదారులకు రంగు వేయాలనుకుంటోంది."
- మద్రాస్ హైకోర్టు
ముఖ్యమంత్రీ... మీ సంగతేంటి?
ముఖ్యమంత్రి పళనిస్వామి కనీసం ఇప్పుడైనా అనధికార బ్యానర్లు పెడుతున్న వారికి వ్యతిరేకంగా ఓ ప్రకటన జారీ చేయగలరా? అని హైకోర్టు ప్రశ్నించింది.
"ఈ దేశంలో ప్రాణాలకు కనీస విలువ లేకుండా పోయింది. ఇది ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోంది. మాకు ప్రభుత్వం మీద నమ్మకం పోయింది."
- మద్రాస్ హైకోర్టు
ట్రాఫిక్ రామస్వామి పిటిషన్‌తో
రహదారిపై అక్రమంగా పెట్టిన ఫ్లెక్సీ తెగిపోయి మీద పడటం వల్ల తమిళనాడులో 23 ఏళ్ల యువతి మరణించింది. పల్లవరం-తొరైపాకం రహదారిలో బైక్‌పై ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటనపై స్పందించిన ట్రాఫిక్ రామస్వామి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వంపై, రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇదీ చూడండి: దిల్లీలో మరోమారు సరి-బేసి విధానం: కేజ్రీవాల్