ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో టెక్ప్రియులు చాలా మందే ఉన్నారు. అధునాతన ఫోన్లు, సామాజిక మాధ్యమాలు విస్తృతంగా వాడుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతం మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న ఆండ్రాయిడ్, యాపిల్ ఆధారిత ఫోన్లను చేతపట్టుకుంటున్నారు.
మోదీ ఇప్పటికే యాపిల్ ఫోన్‌ను వాడుతుండగా.. తాజాగా ఆ జాబితాలోకి ఆయన సన్నిహితుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరారు. యాపిల్ సంస్థ ఇటీవలే విడుదల చేసిన యాపిల్ ఎక్స్ఎస్ ఫోన్‌ను షా వాడుతున్నారు. నేతలు, కార్యకర్తలకు సందేశాలిచ్చేందుకు, సంప్రదించేందుకు, సమాచారం తెలియజేసేందుకు ఆయన ఎక్కువగా ఫేస్బుక్, ట్విట్టర్‌ను వినియోగిస్తుంటారు. షాకు ట్విట్టర్లో కోటి 40లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఆ మంత్రి వద్ద రెండు ఫోన్లు
పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రెండు స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. ఒకటి ఐఫోన్ కాగా మరొకటి ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్. ఆయన వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్‌ను అధికంగా వాడతారు. ధర్మేంద్రను ట్విట్టర్లో 11లక్షల మంది అనుసరిస్తున్నారు.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఫేస్బుక్, ట్విట్టర్లో చురుగ్గా ఉంటారు. తన జట్టుకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ఆయన ఈ రెండు యాప్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఆయనకు ట్విట్టర్లో 51లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌ను ఎంతగా వినియోగిస్తారో అందరికీ తెలుసు. ప్రభుత్వ కార్యక్రమమైనా, సొంత పనైనా ఇట్టే ట్విటర్లో సమాచారమిస్తారు. మోదీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రచారం చేయడానికి ఆమె సామాజిక మాధ్యమాలను అస్త్రంగా వాడారు. వాడుతున్నారు. ఆమెకు ట్విట్టర్లో ప్రస్తుతం 22 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కూడా రెండు ఫోన్లు వాడుతున్నారు. ఒకటి ఐఫోన్ కాగా మరొకటి శామ్సంగ్ కీ ప్యాడ్ ఫోన్. ఆయన వాట్సప్ సహా ట్విట్టర్, ఫేస్బుక్ ఎక్కువగా వాడతారు.
ఈశాన్య దిల్లీ ఎంపీ, భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఐఫోన్ వినియోగిస్తున్నారు. ట్విట్టర్‌ను ఎక్కువగా వాడుతూ పార్టీ శ్రేణులకు సందేశాలివ్వడం, వారిని సమన్వయపరచడంలో ఆయన దిట్ట. ఆయనకు మొత్తం 7.6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
గతేడాది చైనా, దుబాయ్ పర్యటనల్లో మోదీ ఐ ఫోన్ వాడుతున్నట్టు కనపడింది. భద్రతా కారణాల రీత్యా ఆయన యాపిల్‌కు సంబంధించిన హైఎండ్ గాడ్జెట్స్నే వాడుతున్నారు.
ట్రంప్ కంటే మోదీకే ఎక్కువ
ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టర్లో మొత్తం 4 కోట్ల 80 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 11కోట్ల మంది ఆయనను అనుసరిస్తున్నారు. ఈ విషయంలో మోదీ కంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకబడ్డారు. అగ్రరాజ్యాధినేతకు మొత్తం ఫాలోవర్లు 9 కోట్ల 60లక్షల మంది.
2 నుంచి 268కి..
మోదీ నాయకత్వంలో ఫోన్లు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రెండో దేశంగా భారత్ ఎదిగింది. 2014లో దేశంలో రెండు మొబైల్ తయారీ పరిశ్రమలుంటే ప్రస్తుతం వాటి సంఖ్య తయారీ యూనిట్లతో కలుపుకుంటే 268కి చేరింది.