'నమో టీవీ' వ్యవహారంలో డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ టాటా స్కై మాట మార్చింది. 'నమోటీవీ' హిందీ న్యూస్ సర్వీస్ కాదని.. అంతర్జాలం ద్వారా అందించే ఓ ప్రత్యేక సేవ అని ప్రకటించింది. ఈ సేవలకు ప్రభుత్వ అనుమతి (లైసెన్స్) అవసరం లేదని పేర్కొంది.
ఇంతకు మునుపు నమోటీవీ హిందీ న్యూస్ సర్వీస్ అని, జాతీయ రాజకీయాలను సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందిస్తుందని టాటా స్కై ట్వీట్ చేసింది.
ఎన్నికల తరుణంలో ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలను, భాజపా అనుకూల సమాచారాన్ని ప్రచారం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, ఆప్ లాంటి పార్టీలు ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆశ్రయించాయి. ఫలితంగా ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఈ సర్వీస్‌ను ఎలా ప్రారంభించారో వివరణ ఇవ్వాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (ఐబీ)ని ఈసీ ఆదేశించింది.
నమో టీవీ ఒక ప్రచార వేదిక (అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫాం), దాని ప్రసారాలకు ఎటువంటి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
మార్చి 31న నమోటీవీ ప్రారంభమైంది. నరేంద్రమోదీ చిత్రం లోగో ఉన్న ఈ ఛానల్ డీటీహెచ్, కేబుల్ టీవీ ప్లాట్‌ఫాంల్లో అందుబాటులోకి వచ్చింది. 24 గంటలు ప్రసారం అయ్యే నమో టీవీ ప్రారంభం కాగానే మోదీ దాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ప్రత్యక్షంగా చౌకీదార్ ప్రసంగాలను చూడవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. అయితే నమో టీవీకి నిధులు ఎలా సమకూరుస్తున్నారనేది తెలియదు.