దేశంలో కరోనా మరణాల రేటు 1 శాతం కంటే దిగువకు తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.64 శాతంగా ఉందని చెప్పిన ఆయన.. ప్రపంచంలోకెల్లా అతి తక్కువ మరణాల రేటు ఇదేనని పేర్కొన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఈ మేరకు వివరాలు వెల్లడించారు హర్షవర్ధన్.
20% దిగువన యాక్టివ్ కేసులు..
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 78-79 శాతంగా ఉందని హర్షవర్ధన్ చెప్పారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ రికవరీ రేటు కలిగిన దేశం మనదేనన్నారు. దేశంలో పాజిటివ్ కేసులు 50లక్షలు దాటినప్పటికీ.. యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం 20శాతం కంటే తక్కువేనని స్పష్టం చేశారు. యూరప్ దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారి వల్ల చనిపోయిన వారి సంఖ్య భారత్లో తక్కువేనని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికాలో ఎక్కువ కరోనా టెస్ట్లు నిర్వహించగా.. అంతకంటే ఎక్కువ పరీక్షలు మన దేశంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రధాని నేతృత్వంలో..
2021 ప్రారంభానికి దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు హర్షవర్ధన్. మోదీ నేతృత్వంలోని నిపుణుల బృందం గొప్ప ప్రణాళికతో పనిచేస్తోందన్నారు. జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదుకాకముందే దానికి సంబంధించిన సూచనలు చేశామన్నారు. మొదటి కేసు నమోదైనప్పుడే కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా 162 మందిని గుర్తించామని చెప్పారు. కేసుల సంఖ్యను తగ్గించడానికి లాక్‌డౌన్ బాగా తోడ్పడిందని తెలిపారు హర్షవర్ధన్.
దేశంలో 40లక్షలు దాటిన రికవరీలు..
దేశంలో కరోనా రికవరీల సంఖ్య గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ఇప్పటివరకు 40 లక్షల మంది వైరస్ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 78.64 శాతానికి చేరింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 10లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 19.73 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిలో దాదాపు సగం(48.45శాతం) కేసులు.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోనే నమోదవుతున్నాయి. వీటికి తోడు ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలిపితే కేసులు 60 శాతానికి చేరుతున్నాయని కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: 2021 తొలినాళ్లలోనే వ్యాక్సిన్: హర్షవర్ధన్