సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. న్యాయ వ్యవస్థను అస్థిరపరిచేందుకే ఈ విధమైన ప్రయత్నాలు చేశారన్నారు. ఇది న్యాయవ్యవస్థకు బాసటగా నిలవాల్సిన సమయమని తన బ్లాగ్లో రాసుకొచ్చారు. సీజేఐపై అసత్య ఆరోపణలు చేసిన వారికి దీటైన జవాబివ్వాలని అభిప్రాయపడ్డారు జైట్లీ.
వ్యక్తిగత మర్యాద, నైతిక విలువలను పాటించడంలో జస్టిస్ గొగొయి ముందు వరుసలో ఉంటారని జైట్లీ పేర్కొన్నారు. సీజేఐ అభిప్రాయాలతో పలువురు న్యాయ విమర్శకులు విభేదించినప్పటికీ ఆయన విలువలను ఎన్నడూ ప్రశ్నించలేదని స్పష్టం చేశారు.
గతేడాది సీజేఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జస్టిస్ రంజన్ గొగొయి తనను వేధించారని సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఆరోపణలు చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 24న చేపట్టనుంది అత్యున్నత న్యాయస్థానం.
ఇదీ చూడండి: 1971లో అద్భుత అవకాశం వదులుకున్నారు: మోదీ