ఇదీ జరిగింది...
మార్చి 30న జమ్ము బనిహాల్‌కు సమీపంలోని టేతర్ గ్రామంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌కు సమీపంలో ఉన్న కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ వాహనం స్వల్పంగా దెబ్బతింది. కారులోని సిలిండర్ కారణంగానే విస్ఫోటం జరిగినట్లు సీఆర్పీఎఫ్ బృందం నిర్ధరించింది.
కారు పేలే సమయానికి డ్రైవర్ పారిపోయాడు. ఘటనా స్థలాన్ని క్షుణ్నంగా పరిశీలించిన అధికారులు... కీలక ఆధారాలు సేకరించారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్ క్యాన్, జిలెటిన్ స్టిక్, యూరియా, సల్ఫర్ వంటి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ ఐఈడీ తయారీకి ఉపయోగించేవే.
కారు పేలిన చోట దొరికిన ఓ ఉత్తరం ఆధారంగా అధికారులు దర్యాప్తు సాగించారు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి తరహా ఘాతుకానికి పాల్పడడమే తన ఉద్దేశమని ఆ లేఖలో రాసి ఉంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సభ్యుడే ఈ లేఖ రాసి, పరారైన కారు డ్రైవర్ అని నిర్ధరించారు అధికారులు.
విస్తృత గాలింపు తర్వాత... నిందితుడిని ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.