కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియల వేళ.. అసలే విషాదం. అందులోనే మరో దారుణం చోటుచేసుకుంది. నేతలు, అభిమానులు శోక సంద్రంలో ఉన్న సమయంలో... దొంగలు ఏకంగా 11 మంది ఫోన్లను దొంగలించారు. చరవాణిలు కోల్పోయిన వారిలో భాజపా ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బాబుల్ సుప్రియో, పతాంజలి ప్రతినిధి ఎస్కే తిజరవాల ఉన్నారు.
కొద్ది కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో సతమతమవుతున్న జైట్లీ... శనివారం తుది శ్వాస విడిచారు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అంత్యక్రియలు దిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో ఆదివారం జరిగాయి. జైట్లీ అంతిమ సంస్కరణలో పాల్గొనడానికి కేంద్ర మంత్రులు సహా అనేక మంది ప్రజలు నిగంబోధ్ ఘాటకు తరలివెళ్లారు. ఈ సమయంలోనే దొంగలు తమ చేతులకు పని చెప్పారు.
అంత్యక్రియలను కూడా వదలకుండా నేరాలకు పాల్పడటం ఎంతో బాధాకరమని పతాంజలి ప్రతినిధి తిజరవాల ట్వీట్ చేశారు.
'జైట్లీకి తుది వీడ్కోలు పలుకుతున్న సమయంలో నా ఫోన్ కూడా నాకు వీడ్కోలు పలికింది. శ్మశానవాటికనూ వదలకుండా దొంగతనాలకు పాల్పడటం ఎంతో బాధాకరం.'
--- తిజరవాల, పతంజలి ప్రతినిధి.
ఈ ఘటనకు సంబంధించి 5 ఫిర్యాదులు అందినట్టు దిల్లీ పోలీసులు తెలిపారు. చరవాణిలను ట్రేస్ చేస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి:- జైట్లీ కుటుంబసభ్యులకు ప్రధాని మోదీ పరామర్శ