కర్ణాటక మండ్య లోక్సభ స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీశ్ ఇతర పార్టీల నాయకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్న వారికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. కొంత మంది వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
తన కోసం ప్రచారంలో పాల్గొంటోన్న సినీతారల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు సుమలత. తొలిదశ ఎన్నికల్లో ఇతర పార్టీ నేతల ప్రకటనలపై అంతరార్థమేమిటో తెలపాలని కోరారు.
" నాకోసం ప్రచారం చేపడుతోన్న సినీతారలు పశ్చాత్తాపం చెందుతారని కొంతమంది నాయకులు పేర్కన్నారు. అందులో ఉన్న అర్థమేమిటో నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి బెదిరింపులా? ఆ మాటల అర్థమేమిటో వారు వివరించాలి. ఆ ప్రకటనల వెనకాల ఉన్నదెవరో, ఎవరిని బెదిరిస్తున్నారో తెలియాలి."
- సుమలత అంబరీశ్, మండ్య స్వతంత్ర అభ్యర్థి.
జేడీఎస్ నాయకత్వాన్ని పేర్కొంటూ..అధికారంలో ఉన్నవారు ఇతర పార్టీల ప్రజలను వేధింపులకు గురిచేయకూడదని పేర్కొన్నారు సుమలత. ఈ విషయాన్ని మండ్య ఎస్పీ వరకు తీసుకు వెళ్తామని చెప్పారు. నాకు మద్దతు ఇస్తున్నవారిని రక్షించుకోవటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండీ: ప్రజ్ఞా సింగ్కు మరోమారు ఈసీ నోటీసులు