భారత్, బంగ్లాదేశ్ మధ్య 55 ఏళ్లుగా నిలిచిపోయిన రైలు సేవల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గంలో గురువారం ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు అధికారులు. బంగాల్లోని జల్పాయ్‌గుడిలోని హల్దీబడి నుంచి బంగ్లాదేశ్‌లోని చిలహటి వరకు ఈ రైలు మార్గం ఉంది.
భారత్‌తో అప్పటి తూర్పు పాకిస్థాన్ మధ్య 1965లో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో రైలు సేవలను నిలిపేశారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా ఈ నిలుపుదలను కొనసాగించారు.
ఘన స్వాగతం..
ప్రస్తుతం ఏర్పాట్లలో భాగంగా అక్టోబర్ 8న లోకో ఇంజిన్ ట్రయల్ రన్‌ను ఈశాన్య సరిహద్దు రైల్వే నిర్వహించింది. సరిహద్దుకు ఇరువైపులా ఈ ట్రయల్ రన్‌కు ఘన స్వాగతం లభించింది. మరికొన్ని రోజుల్లో బంగ్లాదేశ్ కూడా ఈ తరహా ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం 3.34 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గాన్ని నిర్మించటమే కాకుండా ఆధునిక సదుపాయాలతో హల్దీబడి స్టేషన్‌ను కూడా భారత్ పునరుద్ధరించింది. చిలహటి రైల్వే స్టేషన్‌ను కూడా బంగ్లాదేశ్ ఆధునికీకరించింది. 6.72 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.
ఐదో మార్గం..
భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 8 రైల్వే ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉన్నాయి. ఇందులో 4 మార్గాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. హల్దీబడి-చిలహటి మార్గంతో ఐదో రూట్ అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో రైల్వే సేవల కోసం సరిహద్దుకు ఇరువైపులా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి: బంగాళాఖాతంలో భారత్ - బంగ్లా సంయుక్త నౌకాదళ విన్యాసాలు