కేరళ కోజికోడ్‌కు చెందిన సబ్ కలెక్టర్, సీఐతో సహా మొత్తం 100 మంది క్వారంటైన్లోకి వెళ్లారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎలాంటి ఆశ్రయం లేని వారి కోసం శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆ శిబిరాలను సబ్ కలెక్టర్, సీఐ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఓ శిబిరంలోని వ్యక్తికి వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులతో పాటు శిబిరంలోని 100మంది కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు.
లాక్‌డౌన్ కారణంగా అవస్థలు పడుతున్న నిరాశ్రయులను గుర్తించి అధికారులు వారిని శిబిరాలకు తరలిస్తున్నారు . వారికి కావాల్సిన ఆహారం, మందులను అధికారులే సమకూర్చుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, పోలీసులు వారి పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. ఆశ్రయంలోకి తరలించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఓ వ్యక్తికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆ శిబిరాన్ని పర్యవేక్షించిన అధికారులను, ఆ శిబిరంలో ఉన్న వాలంటీర్లు, ఇతరులను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు.
వైరస్ సోకిన వ్యక్తిని తమిళనాడు వాసిగా అధికారులు గుర్తించారు. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 650 మందికి పైగా నిరాశ్రయులను వివిధ పాఠశాలలు, ఆడిటోరియాలకు తరలించినట్లు పేర్కొన్నారు. కోజికోడ్ ప్రాంతంలో మొత్తం 12 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం వెయ్యి మందికి పైగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.