ఐఐటీలో చేరేందుకు అన్ని అర్హతలు సాధించినప్పటికీ ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా తాను సీటును రద్దు చేసుకుంటున్నట్లు ఉన్న తప్పు లింక్‌ను క్లిక్ చేయడంతో ఏకంగా ఐఐటీ బాంబేలో రావాల్సిన సీటును కోల్పోయాడు. ఈ విషయమై తనను చేర్చుకోవాలంటూ ఐఐటీ బాంబే పాలనా విభాగాన్ని సంప్రదించినప్పటీ వారు తాము జోక్యం చేసుకోలేమంటూ చేతులెత్తేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బాత్రా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆల్ఇండియా స్థాయిలో 270 ర్యాంకు సాధించాడు. ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సీటు కోసం అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా.. చివరి దశలో తప్పుడు లింక్ క్లిక్ చేశాడు. తాను సీటును వదులుకుంటున్నట్లు ఉన్న లింక్ క్లిక్ చేశాడు. ఈ క్రమంలో ఐఐటీ బాంబే ఇటీవల ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేయగా అందులో తన పేరును రాలేదు. సిద్ధాంత్ సీటును వదులుకున్నట్లు ఐఐటీ బాంబే పోర్టల్‌లో వెల్లడించింది. దీంతో ఆందోళనకు గురైన సిద్ధాంత్ తప్పుడు లింక్ క్లిక్ చేయడం వల్లే ఇలా జరిగిందని.. తనను చేర్చుకోవాలంటూ వెళ్లి క్యాంపస్ సిబ్బందిని కోరాడు. దానికి సిబ్బంది ప్రతిస్పందిస్తూ.. సీట్లు అన్ని అయిపోయాయి.. తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని బదులిచ్చారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి మొదట బాంబే హైకోర్టును సంప్రదించగా.. నవంబర్ 23 జస్టిస్ జీఎస్ కులకర్ణి నేతృత్వంలోని ధర్మాసనం తన పిటిషన్‌ను తిరస్కరించింది.
బాత్రా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ.. తన తల్లిదండ్రులు మరణించడంతో తాత, నాయనమ్మల వద్ద ఉండి కష్టపడి చదివి ర్యాంకు సాధించానని పిటిషన్లో పేర్కొన్నాడు. అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా తప్పుడు లింక్ క్లిక్ చేయడం వల్లే సీటు కోల్పోయానని తెలిపాడు. కానీ తాను ఉద్దేశపూర్వకంగా సీటు వదులుకోలేదని తెలిపాడు. ర్యాంకు సాధించడానికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని.. మానవతా దృక్పథంతోనైనా తనకు సీటు ఏర్పాటుచేసి కేటాయించాలని న్యాయస్థానాన్ని కోరాడు.