దిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న హరియాణా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహన నివారణ చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని రద్దు చేసింది సుప్రీంకోర్టు. కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్రం సమర్థమైన చట్టం తీసుకురానుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.
'కాలుష్యం వల్లే దిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇది తక్షణమే నివారించాల్సిన అవసరం ఉంది' అని ధర్మాసనం పేర్కొంది.
'కాలుష్య నివారణకు కేంద్రం సమర్థమైన చర్యలు తీసుకుంటోందని... దానికి సంబంధించి ప్రతిపాదిత డ్రాఫ్ట్‌ను నాలుగు రోజుల్లో కోర్టు సమర్పిస్తాం' అని కోర్టుకు విన్నవించారు మెహతా.
పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాలు గుర్తించేందుకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ బృందాలను మెహరించాలని అక్టోబరు 16న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిని పర్యవేక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్‌తో కూడిన ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
ఇదీ చూడండి: పంట వ్యర్థాల దహన నివారణకు ఏకసభ్య కమిటీ