దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన వేళ, బాధ్యులపై కఠిన చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన దిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్నతస్థాయి అధికారులు సమావేశమయ్యారు. న్యాయమంత్రిత్వ శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ఐబీ, సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
ఎర్రకోటపై జెండాలు ఎగురవేయటాన్ని తీవ్రంగా పరిగణించిన హోంశాఖ, వారిపై చట్టపరమైన చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హింసాకాండకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోడానికి న్యాయ మంత్రిత్వ శాఖ సలహా తీసుకోనున్నట్లు సమాచారం. దాడులకు తెగబడిన వారిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించాలని అధికారులకు హోంశాఖ సూచించింది. మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనపై దిల్లీ పోలీసులు 22 కేసులను నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ఐబీ, కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.