కరోనా కట్టడి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాల్లో వందలాది మంది చిక్కుకుపోయారు వలస కార్మికులు. నెల రోజులకుపైగా ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో కార్మికులు, విద్యార్థులు, పర్యటకులను స్వరాష్ట్రాలకు చేరవేసేందుకు అనుమతించింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు వలస జీవులు.
గుజరాత్లో..
లాక్‌డౌన్‌తో చిక్కుకున్న వారని తరలించేందుకు రాష్ట్రాల మధ్య రవాణాకు అనుమతులిస్తూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన క్రమంలో గుజరాత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉత్త్రర్ప్రదేశ్ నుంచే అధికంగా వలస కార్మికులు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంతో చర్చలు ప్రారంభించింది. అహ్మదాబాద్‌లో చిక్కుకున్న వారు ఇప్పటికే.. తమ సామగ్రిని సర్దుకుని సిద్ధమయ్యారని అధికారులు వెల్లడించారు.
లాక్డౌన్ కారణంగా నాకు ఆదాయం లేకుండా పోయింది. జీవనం సాగించడం కష్టంగా మారింది. నెలకు రూ.13 వేలు సంపాదించేవాడిని. కానీ, నెల రోజులకుపైగా ఒక్క రూపాయి సంపాదన లేదు. అందువల్ల సొంత ఊరికి వెళ్లిపోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుని అయినా కుటుంబాన్ని పోషించుకుంటా. ప్రయాణం కోసం లగేజీ సిద్ధం చేసుకున్నాం. నా సొంత రాష్ట్రంలోనే మంచి పని దొరికితే మళ్లీ ఇక్కడికి రాను.
– శ్యాం సింగ్, మధ్యప్రదేశ్
5వేలకు పైగా..
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారితో పాటు శిబిరాల్లో సుమారు 4వేల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారంతా సొంతూళ్లకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని వెల్లడించారు. త్వరలోనే వారందరినీ తరలిస్తామని లేబర్, ఉపాధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి విపుల్ మిత్ర తెలిపారు. అందులో 2,300 మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారు కాగా మిగతా వారు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వారుగా వెల్లడించారు.
500 మంది కార్మికులను మహారాష్ట్రకు తరలించేందుకు చర్యలు చేపట్టిన్నట్లు తెలిపారు మిత్ర. సరిహద్దులో వారిని వదలగా.. వారి రాష్ట్రాల వారు బస్సుల్లో తీసుకెళతారని స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి యూపీ చాలా దూరంగా ఉన్నందున వలస కార్మికులను తరిలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బస్సులను పంపాలని కోరినట్లు తెలిపారు మిత్ర.