జమ్ము కశ్మీర్లో కేంద్ర మంత్రుల బృందం పర్యటన ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. రాష్ట్ర విభజన, అధికరణ 370 రద్దు ప్రయోజనాలతో పాటు.. కశ్మీర్ అభివృద్ధిపై కేంద్రం చొరవను ప్రజలకు అక్కడి వివరించేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. ఈ మేరకు 38 మందితో కూడిన కేంద్ర మంత్రుల బృందం జమ్ము కశ్మీర్‌లోని దాదాపు 60 ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో సంభాషించనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని కూడా అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.
కశ్మీర్లో అభివృద్ధిపై ప్రచారం చేయండి...
కశ్మీర్ పర్యటన దృష్ట్యా.. కేంద్ర మంత్రిమండలి శుక్రవారం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా.. కశ్మీర్ లోయలోని మారుమూల గ్రామాల్లోనూ పర్యటించాలని మంత్రులను కోరారు మోదీ. కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
మంత్రుల పర్యటన నేపథ్యంలో.. జమ్మూలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు ముఖ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం. భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అమిత్ షా చొరవతో..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ పర్యటన చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనను కేంద్ర హోంశాఖనే స్వయంగా పర్యవేక్షించనుంది. జనవరి 24 వరకు సాగనున్న పర్యటనలో మొత్తం 60 ప్రాంతాలను చుట్టనున్నారు కేంద్ర మంత్రులు. జమ్మూలో 51, శ్రీనగర్లో 8 ప్రాంతాల్లో ప్రజలతో సంభాషించనున్నారు.
కశ్మీర్లో పర్యటించే కేంద్ర మంత్రుల బృందంలో పీయూష్ గోయల్, జి. కిషన్ రెడ్డి, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, వీకే సింగ్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రమేష్ పోఖ్రియాల్ ఉన్నారు.
క్రమంగా ఆంక్షలను సడలిస్తూ..
జమ్ము కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను దశలవారీగా సవరిస్తూ వస్తోంది కేంద్రం. ఇటీవలే విదేశీ ప్రతినిధుల బృందం కశ్మీర్లో పర్యటించింది. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఆయా దేశాల ప్రతినిధులు.